18న రాష్ట్రానికి రాష్ట్రపతి

11 Dec, 2015 02:05 IST|Sakshi

* 31 వరకు బొల్లారంలో శీతాకాల విడిది
* ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సమీక్ష
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ నెల 18న రాష్ట్రపతి శీతాకాల విడిదికి హైదరాబాద్‌కు రానున్నారు. రెండు వారాల పాటు (ఈ నెల 31) బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన విడిది చేస్తారు. ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సమీక్షించారు. విడిదికి అవసరమయ్యే ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో గురువారం సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్మీ, పోలీస్, జీహెచ్‌ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్, వైద్యం, ఆర్ అండ్‌బీ, సమాచార పౌర సంబంధాలు, ఎస్‌పీడీసీఎల్, ఏపీటీఎస్, బీఎస్‌ఎన్‌ఎల్, కంటోన్మెంట్, ఫైర్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్రపతి పర్యటనకు వీలుగా హకీంపేట ఎయిర్‌పోర్టులో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. అన్నిచోట్ల బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు.

అన్ని శాఖల సిబ్బందికి డ్యూటీ పాసులు జారీ చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు. రాష్ట్రపతి ప్రయాణించే మార్గాలలో రోడ్లకు మరమ్మతులు, స్వాగత తోరణాలు, అవసరమైన హెలీప్యాడ్ ఏర్పాటు, బారికేడ్ల నిర్మాణంతోపాటు పరిసరాల పరిశుభ్రతకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో అన్ని శాఖల సమన్వయానికి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల డీఆర్‌వోలు నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రపతి నిలయంలో సీసీ కెమెరాల ఏర్పాటు, అవసరమైన మరమ్మతులు, తాగునీటి సరఫరా, విద్యుదీకరణ, పుష్పాలంకరణ, టెలిఫోన్, కంప్యూటర్, ప్రింటర్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.

 చండీ యాగానికి రాష్ట్రపతి: హైదరాబాద్‌లో విడిది సందర్భంగా రాష్ట్రపతి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. డిసెంబర్ 19న మిలిటరీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ స్నాతకోత్సవంలో, 27న ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో పాల్గొంటారు. ఎర్రవెల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించే అయుత చండీయాగంలో పాల్గొంటారు. ఈ పర్యటనల దృష్ట్యా అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎస్ అధికారులకు సూచించారు. జీఏడీ ముఖ్య కార్యదర్శి అదర్‌సిన్హా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఐజీ అంజనీకుమార్, మహేశ్ భగవత్, కంటోన్మెంట్ బోర్డు సీఈవో సుజాత గుప్తా, ప్రొటోకాల్ డెరైక్టర్ అర్వీందర్‌సింగ్, సమాచార శాఖ డెరైక్టర్ వి.సుభాష్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు