చట్టపరిధిలో పనిచేస్తున్నట్లు లేదు!

16 Mar, 2017 04:20 IST|Sakshi
చట్టపరిధిలో పనిచేస్తున్నట్లు లేదు!

ఏపీ పోలీసుల తీరును తప్పుపట్టిన ప్రెస్‌ కౌన్సిల్‌ విచారణ కమిటీ

- జర్నలిస్ట్‌ నాగార్జునరెడ్డిపై దాడి కేసులో తదుపరి విచారణకు
- ప్రకాశం జిల్లా ఎస్పీ స్వయంగా హాజరుకావాలని చైర్మన్‌ ఆదేశం


సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్‌ వ్యవస్థ చట్టపరిధిలో కాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోందని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా విచారణ కమిటీ అభిప్రాయపడింది. పత్రికాస్వేచ్ఛ, నైతిక నియమావళి ఉల్లంఘన కేసులపై రెండురోజులుగా ఈ కమిటీ హైదరాబాద్‌లో విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లా చీరాలలో జర్నలిస్ట్‌ నాగార్జునరెడ్డిపై దాడి కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ హాజరుకావాలని ఆదేశించినా ఎస్పీ త్రివిక్రమవర్మ బుధవారం విచారణకు హాజరుకాక పోవడంతో కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎస్పీ తరఫున హాజరైన చీరాల డీఎస్పీ ప్రేమ్‌కాజల్, వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వరరావు.. ఎస్పీ ఇతర పనులపై ఐజీ కార్యాలయానికి వెళ్లారని చెప్పడం కౌన్సిల్‌ చైర్మన్‌కు మరింత ఆగ్రహం తెప్పిం చింది. తదుపరి న్యూఢిల్లీలో జరగనున్న విచారణకు ఎస్పీ స్వయంగా హాజరుకావాలని, అవసరమైతే అరెస్ట్‌ వారంట్‌ జారీచేస్తామని కౌన్సిల్‌ చైర్మన్‌ సీకే ప్రసాద్‌ హెచ్చరించారు. నాగార్జునరెడ్డిపై స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ అనుచరులు దాడిచేసిన కేసులో.. కేసు నమోదు, దర్యాప్తునకు సంబంధించిన అంశాలపై కమిటీ సభ్యులు పలు అనుమానాలను వ్యక్తం చేశారు.

కేసు నమోదు విషయమై ప్రభుత్వ న్యాయవాది నుంచి కాకుండా పదవీ విరమణ చేసిన ప్రభుత్వ న్యాయవాది సలహా తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక్క చీరాలలోనే ఇలా జరగడం లేదని, ఆంధ్రప్రదేశ్‌ అంతటా ఇదే విధానం అమలవుతోందని డీఎస్పీ చెప్పిన సమాధానం పట్ల చైర్మన్‌ విస్మయం వ్యక్తం చేశారు. తదుపరి విచారణ జరిగే వరకు బాధిత జర్నలిస్ట్‌పై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు.

జర్నలిస్టులను నిషేధిస్తే ప్రజాస్వామ్యం ఉన్నట్లా?
హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధించిన యాజమాన్యం.. తమది ప్రజాస్వామ్య సంస్థగా పేర్కొనడం విడ్డూరంగా ఉందని విచారణ కమిటీ అభిప్రాయ పడింది. రోహిత్‌ వేముల ఆత్మహత్య నేపథ్యంలో జర్నలిస్టుల ప్రవేశంపై నిషేధం విధించడం, వర్సిటీలోకి వచ్చిన ఫ్రంట్‌లైన్‌ జర్నలిస్ట్‌పై కేసులు బనాయించడంపై బుధవారం కమిటీ విచారణ చేపట్టింది. కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం తో తదుపరి విచారణకు హాజరుకావాలని యూనివర్సిటీ ప్రతినిధి ప్రొఫెసర్‌ సంజయ్‌కు సూచించింది. దీనిపై సమగ్ర నివేదికను అందించాలని సైబరాబాద్‌ కమిషనర్‌ను ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఆదేశించారు. ఔట్‌లుక్‌ మేగజైన్‌ ఎడిటర్‌కు సంబంధించిన కేసు న్యాయస్థానంలో నడుస్తున్నందున, ఆ కేసుపై విచారణను వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు