ఆర్టీసీ ఆదాయానికి వరుణుడి గండి

26 Sep, 2016 02:54 IST|Sakshi
ఆర్టీసీ ఆదాయానికి వరుణుడి గండి

- వారం రోజులుగా భారీగా పడిపోయిన ఓఆర్
- రోజుకు రూ.2 కోట్ల మేర నష్టం
- వంద గ్రామాలకు పూర్తిగా నిలిచిన సర్వీసులు
- హైదరాబాద్‌లోనూ తప్పని తిప్పలు

 
సాక్షి, హైదరాబాద్:
మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది టీఎస్ ఆర్టీసీ పరిస్థితి. ఇప్పటికే నష్టాలతో నెట్టుకొస్తున్న ఆర్టీసీ ఆదాయానికి వరుణుడు తీవ్ర ‘గండి’కొట్టాడు. దీంతో వారం రోజులుగా పలు గ్రామాలకు బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. సగటున రోజుకు రూ.2 కోట్ల మేర ఆదా యం కోల్పోయింది. సాధారణ రోజుల్లో టీఎస్‌ఆర్టీసీకి రూ.9.5 కోట్ల ఆదాయం సమకూరుతుంది. కానీ వారం రోజులుగా అది రూ.7.5 కోట్లకే పరిమితమవుతోంది. మరోవైపు చాలా ప్రాంతాల్లో రోడ్లు భారీ కోతకు గురవడం, కల్వర్టులు దెబ్బతినడం, ఇప్పటికీ రోడ్లపై నుంచి వరద నీరు ఉండటంతో బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని చోట్ల తాత్కాలికంగా రోడ్లను మరమ్మతు చేసి రాకపోకలను పునరుద్ధరించినా ఇంకా దాదాపు వంద గ్రామాలకు బస్సులు నిలిచిపోయాయి.
 
 దీంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో భారీగా పడిపోయింది. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొం డ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. మరో వారం పాటు ఇదే పరిస్థితి ఉంటుందని ఆర్టీసీ అధికారులు అంచ నా వేస్తున్నారు. చిరుజల్లులకే ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిలిచిపోయే నగరంలో భారీ వర్షాలు ట్రాఫిక్‌ను అస్తవ్యస్తం చేస్తున్నాయి. దీనికి తోడు రోడ్లు దెబ్బతినడంతో బండి కదలడమే గగనమవుతోంది. మామూలు రోజుల్లో పట్టే సమయానికి రెట్టింపు సమయం పడుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. కొన్ని రూట్లలో ఒక ట్రిప్పుకు 13గంటలు పడుతోందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆర్టీసీకి 40 శాతం ట్రిప్పులు నిలిచిపోతున్నట్లు పేర్కొంటున్నారు.
 
 విదేశీ పర్యటనకు ఎండీ, చైర్మన్
 భారీ వర్షాలతో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న తరుణంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావు, సిటీ ఆర్‌ఎం కొమురయ్య జర్మనీ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో అధికారుల సెలవులు రద్దు చేస్తున్నామని, అంతా క్షేత్రపర్యటనలో ఉండి పరిస్థితులు చక్కదిద్దాలని సీఎం ఆదేశించిన విషయం విదితమే. అయితే జర్మనీ పర్యటనకు దేశవ్యాప్తంగా అన్ని ఆర్టీసీల నుంచి అధికారులు వస్తున్నందున ప్రభుత్వ అనుమతి తీసుకుని ఆ ముగ్గురు పర్యటనకు వెళ్లినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు