-

శరవేగంగా ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పనులు

5 May, 2018 01:39 IST|Sakshi

రూ.5,260 కోట్లతో పునరుద్ధరణ ప్రక్రియ

ఇప్పటికే 77శాతం పూర్తి

డిసెంబర్‌ నాటికి ఎరువుల ఉత్పత్తి

డీజీఎం విజయ్‌కుమార్‌ భంగార్‌

గోదావరిఖని(రామగుండం): రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పునరుద్ధరణ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 77 శాతం పనులు పూర్తయినట్లు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ డీజీఎం విజయ్‌కుమార్‌ భంగార్‌ తెలిపారు.

రూ.5,260 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కర్మాగారంలో డెన్మార్క్‌కు చెందిన అల్దర్‌టాప్‌ అనే సంస్థ యూరియాను ఉత్పత్తి చేసే యంత్రాలను సమకూరుస్తోందని శుక్రవారం ఆయన ప్లాంట్‌లో విలేకరులకు తెలిపారు. ఎరువుల ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా నిర్మిస్తున్న ప్రిల్లింగ్‌ టవర్‌ను 134 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఇందులో ప్రస్తుతం లిప్ట్‌ పనులు, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్‌ పనులు జరుగుతున్నాయి.  

32 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌..
ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కర్మాగారంలో అంతర్గత అవసరాల కోసం 32 మెగావాట్ల క్యాప్టివ్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను బీహెచ్‌ఈఎల్‌ సంస్థ నిర్మించింది. క్వార్టర్లు, ఇతర అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగించనున్నారు. కర్మాగారంలో ఎరువుల ఉత్పత్తి ప్రక్రియ కోసం 220 కేవీ స్విచ్‌ యార్డును నిర్మించారు. దీనికి ట్రాన్స్‌కో నుంచి విద్యుత్‌ లైన్లు ఏర్పాట్లు చేయాల్సి ఉంది.

  ఏటా 0.5 టీఎంసీల నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్లాంట్‌ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లంపల్లి పంప్‌హౌస్‌ నుంచి ఈ నీటిని తీసుకువచ్చేందుకు పైపులైన్లు బిగిస్తున్నారు. అలాగే ప్లాంట్‌లో ఎల్లంపల్లి నీటిని శుద్ధిచేసి వాడేందుకు వీలుగా ప్రత్యేక పంప్‌ హౌస్‌ను నిర్మించారు.

ఉత్పత్తి చేసిన ఎరువులను రవాణా చేయడానికి వీలుగా రైల్వే లైన్‌ను ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. కర్మాగారానికి అవసరమైన అత్యాధునిక యంత్రాలు వారంలోగా రామగుండం చేరుకోనున్నాయి. సిబ్బంది కోసం క్వార్టర్లు సిద్ధం చేస్తున్నామని డీజీఎం విజయ్‌కుమార్‌ భంగార్‌ తెలిపారు.

విధులు బహిష్కరించిన కార్మికులు
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో వివిధ కాంట్రాక్టర్ల కింద పనిచేస్తున్న కార్మికులకు గత 3 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని పేర్కొంటూ శుక్రవారం విధులు బహిష్కరించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ గేట్‌ వద్ద ఉదయం బైఠాయించి నిరసన తెలిపారు.

మరిన్ని వార్తలు