పప్పుతో ఎలుక ఫ్రీ..!

9 Aug, 2017 23:53 IST|Sakshi
పప్పుతో ఎలుక ఫ్రీ..!

యాప్‌ ద్వారా బిగ్‌ బాస్కెట్‌లో సరుకుల ఆర్డర్‌
పప్పు ప్యాకెట్‌లో చచ్చిన ఎలుక
మాదాపూర్‌ పీఎస్‌లో బాధితురాలి ఫిర్యాదు


గచ్చిబౌలి: ఇంట్లో ఏదో ఓ మూల ఎలుక చనిపోతేనే కంపుకొడుతుంది. అదే ఆర్డర్‌ చేసిన పప్పు ప్యాకెట్‌లో చనిపోయిన ఎలుక దర్శనమిస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఆన్‌లైన్‌ సూపర్‌ మార్కెట్‌లో దేశ వ్యాప్తంగా నెట్‌ వర్క్‌ కలిగిన బిగ్‌ బాస్కెట్‌ ద్వారా సరఫరా చేసిన  పప్పు ప్యాకెట్లో చనిపోయిన ఎలుక దర్శనమివ్వడంతో బాధితురాలు మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  వివరాల్లోకి వెళితే..రాజమండ్రి ఐడీబీఐ బ్యాంక్‌లో డిప్యూటీæ జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న మానికొండ రవి కుమార్‌ కుటుంబం మాదాపూర్‌లోని శ్రీరాంనగర్‌లో నివాసం ఉంటోంది.

ఈ నెల 6న రవికుమార్‌ భార్య సుమన మొబైల్‌ యాప్‌ ద్వారా బిగ్‌ బాస్కెట్‌ సూపర్‌ మార్కెట్‌కు సరుకులు ఆర్డర్‌ చేసింది. మినప పప్పు, ఇండ్లీ రవ్వ, పనీర్, నెయ్యి, రిఫైండ్‌ తదితర పది రకాల సరుకులను ఆర్డర్‌ చేసి బిల్లు చెల్లించింది.. 7వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో డెలివరీబాయ్‌ వారి ఇంటి గుమ్మం ముందు సరుకుల సంచి ఉంచి వెళ్లాడు. కొద్ది సేపటికి వచ్చిన సుమన సరుకులను తీసుకొని ఇంట్లో ఉంచింది. 8న ప్యాకెట్‌ తెరిచేందుకు ప్రయత్నించగా అందులో నల్లటి ఆకారం కనిపించడంతో తెరవకుండా అలానే ఉంచింది. బుధవారం ఉదయం వీడియో తీస్తూ ప్యాకెట్‌ను కత్తిరించి చూడగా, ప్యాకెట్‌లో చనిపోయిన ఎలుక కనిపించింది. దుర్వాసన రావడంతో ప్యాకిగ్‌ చేసినప్పుడే ఎలుక చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు.

మాదాపూర్‌ పీఎస్‌లో కేసు నమోదు
దీంతో బాధితురాలు ప్యాకెట్‌ తీసుకువెళ్లి మాదాపూర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బిగ్‌ బాస్కెట్‌ నిర్లక్ష్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విజయ్‌ కుమార్‌ తెలిపారు. ప్యాకెట్‌ కత్తిరించిన వీడియోలు, ప్యాకెట్‌లో ఎలుక ఫొటోలను పోలీసులు సేకరించారు.

రెండేళ్లుగా సరుకులు తీసుకుంటున్నా: సుమన
గత రెండేళ్లుగా బిగ్‌ బాస్కెట్‌లో సరుకులు ఆర్డర్‌ చేస్తున్నట్లు సుమన ‘సాక్షి’కి తెలిపారు. పప్పు ప్యాకెట్లో ఎలుక కనిపించడం దారుణమన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంపై వినియోగదారుల ఫోరంలోనూ ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు