మహానేతకు మరణం లేదు : షర్మిల

8 Jan, 2016 07:24 IST|Sakshi
మహానేతకు మరణం లేదు : షర్మిల

  ► నిజామాబాద్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర  
  ► తెలుగు జాతి ఉన్నంత వరకు వైఎస్ ప్రజల గుండెల్లోనే
  ► అన్ని ప్రాంతాల వారిని సొంత బిడ్డల్లా చూసుకున్నారు
  ► రైతును రాజు చేసి.. ప్రజలకు ఆత్మబంధువయ్యాడు
  ► మొదటి రోజు నాలుగు కుటుంబాలకు పరామర్శ
  ► నేటితో ముగియనున్న పరామర్శ యాత్ర


సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘‘రైతు రాజయ్యే రోజు కోసం.. పేదలకు సంక్షేమ ఫలాలు అందడం కోసం అందరం ఒక్కటవుదాం. పేద ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకున్న దివంగత వైఎస్సార్ ఆశయ సాధన కోసం కలిసికట్టుగా ముందుకు సాగుదాం..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పిలుపునిచ్చారు. మహానేతకు మరణం లేదని, ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారని చెప్పారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల గురువారం నిజామాబాద్ జిల్లాలో రెండో విడత పరామర్శ యాత్ర చేపట్టారు.  పిట్లం మండలం చిల్లర్గి, జుక్కల్, బీర్కూరు మండలం దుర్కి, వర్నిలో నాలుగు కుటుంబాలను పరామర్శించారు.

జుక్కల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం షర్మిల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘రాజన్న బిడ్డను... జగనన్న చెల్లెల్ని..’ అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ‘‘పేదలను వైఎస్సార్ గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు. అన్ని ప్రాంతాలవారిని సొంత బిడ్డల్లా ప్రేమించాడు. రైతును రాజు చేశాడు. ఆయనకు మరణం లేదు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్ బతికే ఉంటాడు. ఆయన పథకాలను మనమే బతికించుకోవాలి. ఆయన ఆశయాలను నిలబెట్టుకోవాలి. సమయం వచ్చినప్పుడు చేయి, చేయి కలపాలి. రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకోవాలి’’ అని పిలుపునిచ్చారు.
 

వైఎస్ బతికుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు..
వైఎస్ బతికి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని, ప్రతీ పేదవాడికి సొంతిల్లు ఉండేదని, వ్యవసాయానికి ఏడు గంటలకు బదులు 9 గంటల కరెంట్ వచ్చేదని షర్మిల అన్నారు. ‘‘ఆయన ఉంటే ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు ఉండేది. మన బిడ్డలకు ఉచితంగా విద్య అందేది. ఉద్యోగాలు వచ్చేవి. ప్రతి ఇళ్లూ కళకళలాడేది’’ అని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారిని ఆదుకొని రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలకు ఆత్మబంధువయ్యారని చెప్పారు. రైతన్నకు ఉచిత విద్యుత్ అందించి రుణాలు మాఫీ చేశారని, ఆడపడుచులు తమ కాళ్లపై తాము నిలబడేందుకు పావలా వడ్డీ రుణాలు అందించారన్నారు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకాలు తెచ్చారన్నారు.

వైఎస్ ప్రవేశపెట్టిన 108 పథకం లక్షలాది మందికి ప్రాణం పోసిందని చెప్పారు. పేదలపై భారం పడకూడదని తన ఐదేళ్ల పాలనలో ఆర్టీసీ, కరెంటు ధరలు పెంచలేదని గుర్తుచేశారు. తొలిరోజు పర్యటనలో షర్మిల పిట్లం మండలం చిల్లర్గిలో బట్టు బాలయ్య, జుక్కల్‌లో శిఖామణి, బీర్కూర్ మండలం దుర్కిలో కుర్మ విఠల్, వర్ని మండలం పాతవర్ని గ్రామంలో సాయులు కుటుంబాలను పరామర్శించారు. షర్మిల వెంట పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు నాయుడు ప్రకాష్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్ జిల్లా నాయకులు ఉన్నారు.
 

నేడు పైలాన్ ఆవిష్కరణ
షర్మిల తెలంగాణలో చేపట్టిన పరామర్శ యా త్ర శుక్రవారం ముగియనుంది. 2014 డిసెం బర్ 8న మహబూబ్‌నగర్ నుంచి మొదలైన పరామర్శ యాత్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సాగింది. రాష్ట్రవ్యాప్తంగా 55 రోజులపాటు 7,718 కిలోమీటర్లు ప్రయాణించి షర్మిల 310 కుటుంబాలను కలుసుకున్నారు. శుక్రవారం గాంధారి మండలం బ్రాహ్మణపల్లిలో నీరడి పోచయ్య కుటుంబాన్ని పరామర్శించడంతో యాత్ర ముగియనుంది. పరామర్శ యాత్ర ముగింపు సందర్భంగా పోతంగల్ కలాన్‌లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను షర్మిల ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు.
 
గ్రేటర్‌లో ముగిసిన యాత్ర
గ్రేటర్ హైదరాబాద్‌లో షర్మిల పరామర్శ యాత్ర గురువారం ముగిసింది. మూడోరోజు ఆమె మూడు కుటుంబాలను పరామర్శించారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాలలో షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఉదయం 9.40కు లోటస్‌పాండ్ నుంచి బయల్దేరిన వైఎస్ తనయ.. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మీదుగా రహమత్‌నగర్ చేరుకొన్నారు. అక్కడ వైఎస్సార్ అభిమానులు డాక్టర్ ప్రపుల్లారెడ్డి, షమీన్ బేగం, చోటు, రమేశ్, జేఎల్ మేరీ, సందీప్ కుమార్ ఏర్పాటు చేసిన వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడ్నుంచి వినోదా అపార్ట్‌మెంట్ చేరుకొని మడత సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించారు.

అనంతరం లక్డీకాపూల్‌లోని రాజ్‌దూత్ హోటల్ సమీపంలోకి చేరుకోగా స్థానిక నాయకులు ఎం.మహేశ్ యాదవ్ ఘన స్వాగతం పలికారు. ర్యాలీగా బడా గణేష్ విగ్రహం వద్దకు చేరుకున్న షర్మిల.. అక్కడ ప్రజలకు అభివాదం చేసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేశారు. తర్వాత మారుతీనగర్‌లోని శివలాల్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడ్నుంచి రసూల్‌పురా వెళ్లి కట్టమైసమ్మ బస్తీలో లత కుటుంబాన్ని పరామర్శించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు నిజామాబాద్ జిల్లాలో పరామర్శ యాత్రకు బయల్దేరి వెళ్లారు. పెద్దఎత్తున జనం పరామర్శ యాత్రలో పాల్గొనటంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. పరామర్శ యాత్రలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి,  హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆదం విజయ్‌కుమార్, పార్టీ నేతలు నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, ఆర్.బ్రహ్మయ్య, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, ఎం.సందీప్ కుమార్, మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ముజ్‌తబా అహ్మద్, హర్షద్, బి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు