తల్లిదండ్రుల నిర్లక్ష్యం, బడాయిలే.. హత్యకు కారణం

14 May, 2015 14:29 IST|Sakshi
తల్లిదండ్రుల నిర్లక్ష్యం, బడాయిలే.. హత్యకు కారణం

హైదరాబాద్ : తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం, యువకుల మధ్య ఎచ్చులు, బడాయిల వల్లే నబీల్ మహ్మద్ హత్యకు కారణమని డీసీపీ వి. సత్యనారాయణ తెలిపారు. పాతబస్తీ మీరాలంమండికి చెందిన నబీల్ అహ్మద్ స్ట్రీట్ ఫైట్లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను...పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి వద్ద నుంచి 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ గురువారం మీడియా సమావేశంలో వివరించారు. బడాయి మాటలు, ఎచ్చులతో యువకులు సైటెర్లు వేసుకుని... ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపించుకునేలా ప్రవర్తించడం.. అది కాస్తా ముదిరి స్ట్రీట్ ఫైట్కు దారి తీసినట్లు చెప్పారు. అలాగే యువకుల తల్లిదండ్రులకు పిల్లల్ని గారాభం చేయటం, వారిని పట్టించుకోకపోవటం జరిగిందన్నారు. స్ట్రీట్ఫైట్లో నబీల్ మహ్మద్ మృతి చెందగా, స్నేహితులు ఆ విషయాన్ని దాచిపెట్టి సాక్ష్యాలను తారుమారు చేసినట్లు చెప్పారు.

అయితే వైద్యుల నివేదికలో తలకు బలమైన దెబ్బలు తగలడం వల్లే నబీల్ మృతి చెందినట్లు నివేదిక రావటంతో తాము అన్ని కోణాల్లో విచారణ జరిపినట్లు డీసీపీ వెల్లడించారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చిన వీడియోను కూడా తమ సిబ్బంది పరిశీలించి, విచారణ జరపడంతో అసలు విషయం బయటపడిందన్నారు. నబీల్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు తొమ్మిదిమందిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. వీరందర్ని కోర్టుకు హాజరు పరచనున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు