మెట్రో కూత ఇంకెప్పుడు!

3 Oct, 2016 04:28 IST|Sakshi
మెట్రో కూత ఇంకెప్పుడు!

- మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిన మెట్రో రైలు ప్రారంభం  
- మియాపూర్- ఎస్‌ఆర్‌నగర్, నాగోల్-మెట్టుగూడ రూట్లు సిద్ధం
- ప్రారంభ తేదీపై సర్కారు మౌనం

 
సాక్షి, హైదరాబాద్: లక్షల్లో వాహనాలు... అతుకులుగతుకుల రహదారులు... బిజీ లైఫ్‌లో గంటలకు గంటలు ట్రాఫిక్ పద్మవ్యూహాలను ఛేదించడానికే ఖర్చవుతోంది నగరవాసులకు! మెట్రో రైలు పరుగు పెడితే ఆ కష్టాలు కొంతైనా తీరతాయని భావించిన వారికి ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఈ దసరాకన్నా రైలు పట్టాలెక్కుతుందనుకుని ఆశించిన వారి ఆశలపై ఇటు సర్కారు... అటు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ నీళ్లు జల్లుతున్నాయి. ప్రారంభ తేదీపై రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.
 
 రెండు రూట్లు సిద్ధం...
 ఇప్పటికే నాగోల్-మెట్టుగూడ (8 కి.మీ.), మియాపూర్-ఎస్.ఆర్.నగర్ (11 కి.మీ.) మెట్రో మార్గం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అవసరమైన 57 రైళ్లు కూడా ఉప్పల్, మియాపూర్ మెట్రో డిపోల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ... వాణిజ్య రాకపోకలకు అవసరమైన అనుమతులు సైతం ఇచ్చేసింది. కానీ ఆస్తుల సేకరణ, రైట్ ఆఫ్ వే సమస్యల కారణంగా మెట్రో నిర్మాణ గడువు 2017 జూన్ నుంచి 2018 డిసెంబరు వరకు పొడిగించడంతో నిర్మాణ వ్యయం సుమారు రూ.3వేల కోట్లు పెరగనుంది.

ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని నిర్మాణ సంస్థ కోరుతున్నట్లు తెలిసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలేవీ రాకపోవడంతో ప్రారంభం విషయంలో నిర్మాణ సంస్థ సైతం ముందుకురావడం లేదని సమాచారం. మరోవైపు ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మార్గంలో అలైన్‌మెంట్ మార్పుపై ప్రభుత్వం ఎలాంటి దిశానిర్దేశం చేయకపోవడంతో మెట్రో పనులు ప్రారంభం కాలేదు.
 
 పురోగతి సరే.. పరుగులేవీ...
 ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా, నాగోల్-రహేజా ఐటీపార్క్... మూడు కారిడార్లలో మొత్తం 72 కి.మీ. మార్గంలో మెట్రో పనులు జరుగుతున్నాయి. మొత్తం 2,748 పిల్లర్లకు గానూ 2,157 పిల్లర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 48 కి.మీ. మార్గంలో పట్టాలు పరిచేందుకు వీలుగా స్పాన్‌లు ఏర్పాటు చేశారు. ప్రధానంగా మియాపూర్-ఎస్.ఆర్‌నగర్ రూట్లో స్టేషన్ల నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. నాగోల్-మెట్టుగూడ మార్గంలోని స్టేషన్లకు అన్ని హంగులూ అద్దారు. కానీ ఈ మార్గాల్లో మెట్రో కూత ఎప్పుడన్నది సస్పెన్స్‌గా మారింది.
 
 అలైన్‌మెంట్‌పై అదే తీరు...
 ఇక ఎంజీబీఎస్-ఫలక్‌నుమా (5.3కి.మీ.) మార్గంలోనూ అలైన్‌మెంట్ మార్చాలని గతంలో పట్టుబట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ తరవాత నిపుణుల కమిటీని నియమించింది. ప్రభుత్వం సూచించిన ప్రకారం మెట్రో మార్గాన్ని మూసీ నది మీదుగా మళ్లిస్తే వాణిజ్య పరంగా ఉపయుక్తం కాదని, సాంకేతికంగానూ ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. అయితే రూటు మార్పు అంశంపై నగరంలోని అన్ని రాజకీయ పక్షాలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
 
 కానీ... ఏడాదిగా ఎలాంటి సమావేశం నిర్వహించలేదు. దీంతో ఈ రూట్లో పనులు మొదలు కాలేదు. ఇక మూడు కారిడార్లలో ఏర్పాటు కానున్న 64 స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు మినీ బస్సులను నడుపుతామని ప్రకటించినా... నేటికీ ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేదు. ఇప్పటివరకు 18 స్టేషన్ల వద్ద మాత్రమే పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. మిగతా చోట్ల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకం!

మరిన్ని వార్తలు