కనీస వేతనం రూ.10 వేలు

18 Apr, 2016 03:21 IST|Sakshi
కనీస వేతనం రూ.10 వేలు

♦ కాంట్రాక్టు కార్మికులకు దేశమంతా అమలయ్యేలా ఆర్డినెన్స్ తెస్తాం
♦ నిపుణులైన కార్మికులకు రూ.18 వేలు: కేంద్రమంత్రి దత్తాత్రేయ
♦ న్యాయశాఖకు ఫైలు పంపాం.. త్వరలోనే గెజిట్
♦ పార్లమెంట్‌లో చట్టానికి కాంగ్రెస్, లెఫ్ట్ అడ్డుపడుతున్నాయని విమర్శ
 
 సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.10 వేలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. నిపుణులైన (స్కిల్డ్) కార్మికులకు కనీసం రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దత్తాత్రేయ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా కార్మికులందరికీ సమాన వేతనం అందించేందుకు త్వరలో ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ మంత్రికి సంబంధిత ఫైలు పంపామని, త్వరలో గెజిట్ విడుదల చేస్తామని వివరించారు.

కనీస వేతన చట్టానికి పార్లమెంట్‌లో చట్టబద్ధత తీసుకురావడానికి తాము చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు అడ్డుపడుతున్నాయని దుయ్యబట్టారు. వారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కనీస వేతన చట్టానికి పార్లమెంట్‌లో చట్టబద్ధత తీసుకొస్తామని స్పష్టం చేశారు. కార్మికులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్, వామపక్ష పార్టీలే తమపై దుష్ర్పచారం చేస్తున్నాయని విమర్శించారు. కార్మికుల సంక్షేమం కోసం కేంద్రం ఇది వరకే కనీస పెన్షన్‌ను రూ.వెయ్యి చేసిందని, బోనస్‌ను రూ.3,500 నుంచి రూ.7 వేలకు పెంచిందని గుర్తుచేశారు.

 అన్ని కంపెనీలు పాటించాల్సిందే..
 ప్రస్తుతం కాంట్రాక్టు కార్మికులకు రోజుకు రూ.160 మాత్రమే అందుతోందని, ఇకపై రూ.333 అందేలా చర్యలు తీసుకుంటున్నామని దత్తాత్రేయ చెప్పారు. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అన్ని కంపెనీలు, పరిశ్రమలు విధిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. లేకపోతే కార్మిక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తమ నిర్ణయం వల్ల ముఖ్యంగా పారిశుధ్య కార్మికుల లబ్ధి చేకూరుతుందని చెప్పారు. తెలంగాణలో వేతనాలు పెంచాలంటూ పారిశుధ్య కార్మికులు చేసిన సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. కేంద్రం తీసుకురానున్న ఆర్డినెన్స్ ద్వారా వారికి ఇక నుంచి కనీసం రూ.10 వేలు అందుతుందన్నారు.

అలాగే కాంట్రాక్టు కార్మికులను వేధించకుండా, ఇష్టానుసారం బదిలీలు చేయకుండా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొన్నిచోట్ల కార్మికులకు నెలవారీ వేతనాలు ఇవ్వకుండా యాజమాన్యాలు వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కనీస వేతన చట్టం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లక్ష మందికిపైగా లబ్ధి చేకూరుతుందన్నారు. అలాగే కార్మికులకు సొంత ఇళ్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇది వరకు ఇంటి నిర్మాణం కోసం కేంద్రం రూ.40 వేలు మాత్రమే ఇచ్చేదని, ప్రస్తుతం దాన్ని రూ.1.50 లక్షలకు పెంచినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి స్థలాలు కేటాయిస్తే తామే ఇళ్లు నిర్మిస్తామన్నారు.

>
మరిన్ని వార్తలు