ప్రెస్‌క్లబ్ ఉత్సవాలకు టీయూడబ్ల్యూజే దూరం

28 Nov, 2015 20:17 IST|Sakshi

జర్నలిస్టుల ఐక్యతను దెబ్బతీసే విధంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గంలో ఉన్న కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని.. ఈ తీరును జీర్జించుకోలేక ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవాలకు దూరంగా ఉంటున్నట్లు టీయూడబ్ల్యూ జే నేతలు తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడిన ఐజేయూ నేతలు కే.శ్రీనివాస్ రెడ్డి, దేవుల పల్లి అమర్ బషీర్ బాగ్ లో ఉన్న ప్రెస్ క్లబ్ కు సోమాజీ గూడలో ఉన్న ప్రభుత్వ భవనాన్ని కేటాయిస్తూ.. 1995లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారని.. యూనియన్ వారసత్వంగా ఉన్న ప్రెస్ క్లబ్ రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన టీయూడబ్ల్యూ జేకి అనుబంధంగానే కొనసాగాల్సి ఉంటుందని అన్నారు.

 

కార్యవర్గంలోని కొందరు వ్యక్తులు జర్నలిస్టుల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చట్టబద్దంగా ప్రెస్ క్లబ్ కు సంక్రమించిన అధికారాలను కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

ప్రెస్‌క్లబ్ పాలకమండలి పదవీకాలం ముగియగా, స్వర్ణోత్సవాల పేరుతో మూడు రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారన్నారు. 50 సంవత్సరాలు ప్రెస్‌క్లబ్‌ను తీర్చిదిద్దిన వారిని కనీసం సంప్రదించకుండా, ప్రెస్‌క్లబ్‌కు మాతృసంస్థగా ఉన్న యూనియన్ నేతలను పరిగణలోకి తీసుకోకుండా స్వర్ణోత్సవాలు ఎలా జరుపుతారని ప్రశ్నించారు.

1965 మే 25న ఏర్పాటైన ప్రెస్‌క్లబ్‌కు ఆరునెలల తరువాత స్వర్ణోత్సవాలు నిర్వహించ డాన్ని తప్పుపట్టారు. ఈ సమావేశంలో ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు అమరనాథ్, ఐజేయూ కార్యదర్శి నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యుజె ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, హెచ్‌యూజే అధ్యక్షుడు కోటిరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు