అంబేడ్కర్‌ వర్సిటీలో వేతనాల స్కాం

4 Sep, 2017 02:52 IST|Sakshi
అంబేడ్కర్‌ వర్సిటీలో వేతనాల స్కాం
భార్య పేరిట ఉద్యోగం సృష్టించిన డేటాఎంట్రీ ఆపరేటర్‌  
- ఆమె ఖాతాలోకి ప్రతి నెలా రూ.3 లక్షల చొప్పున మళ్లింపు 
ప్రాథమికంగా రూ.30 లక్షలకుపైగా స్వాహా చేసినట్లు అంచనా 
 
సాక్షి, హైదరాబాద్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో వేతనాల స్కాం వెలుగులోకి వచ్చింది. అకౌంట్స్‌ విభాగంలో డేటాఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్న రాజేశ్వర్‌రావు తన భార్యను వర్సిటీలో ఉద్యోగిగా సృష్టించి, ఆమె ఖాతాలోకి భారీగా నిధులను మళ్లించాడు. ఒక వ్యక్తి ఖాతాలోకి ప్రతి నెలా రూ.3 లక్షల చొప్పున డబ్బు జమ అవుతుండటం, మొన్నటి జనవరిలోనే రూ.7.5 లక్షలకు పైగా డబ్బు జమ కావడం, గత నెలలో రూ.3.25 లక్షలు ఆ ఖాతాలోకి వెళ్లడంతో వర్సిటీ ఖాతాలు ఉన్న బ్యాంకు అధికారులు అనుమానంతో వర్సిటీ అధికారులకు విషయం తెలియజేశారు. దీంతో ఈ తతంగం వెలుగులోకి వచ్చింది.

వర్సిటీ ఉన్నతాధికారులు అకౌంట్స్‌ విభాగంలో తనిఖీచేసి రూ.30 లక్షలను వేతనం రూపంలో సదరు డేటాఎంట్రీ ఆపరేటర్‌ నిధులను మళ్లించినట్లు అంచనాకు వచ్చారు. ఉద్యోగుల వేతనాల బిల్లులను చేసే పని అతనిది. బిల్లులు చేసే క్రమంలో పేపరుపై అధికారుల ఆమోదం తీసుకునేప్పుడు, అకౌంట్స్‌ ఆఫీసర్‌కు,వర్సిటీ రిజిస్ట్రార్‌కు వెళ్లే ఫైలులో అన్ని సరిగ్గానే ప్రతిపాదిం చేవాడు. ఆ తర్వాత బ్యాంక్‌కు ఆన్‌లైన్‌ ద్వారా పంపించే సాఫ్ట్‌కాపీలో ఇతర ఉద్యోగులతోపాటు తన భార్య పేరును చేర్చి ఆమె ఖాతాలోకి లక్షల రూపాయలు జమ అయ్యేలా బ్యాంకు అధికారులకు పంపేవాడు. ఈ తతంగం ఏడాదిగా జరుగుతోంది. కచ్చితంగా ఏదోక సమయంలోగానీ, మార్చిలో చేసే ఆడిట్‌లోగానీ ఈ వ్యవహారం వర్సిటీ అకౌంట్స్‌ అధికారుల దృష్టికి వచ్చి ఉంటుందని, ఎందుకు వెలుగులోకి తేలేదని ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
విచారణ కమిటీ వేశాం: ప్రొ.సీతారామారావు, వీసీ
రాజేశ్వర్‌రావు మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు శాఖాపరంగా విచారణకు కమిటీనీ ఏర్పాటు చేశాం. ప్రభుత్వానికి విషయాన్ని నివేదించాం. డబ్బును మళ్లించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది వాస్తవమే. అతన్ని సర్వీసు నుంచి తొలగించాలని నిర్ణయించాం. 
 
గతంలోనూ ఫీజుల స్కాం.. 
సదరు ఉద్యోగి గతంలో ఫీజుల స్కాంలోనూ నిందితు డే నని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు ఫీజుల కోసం చెల్లించిన డీడీలను మాయం చేసేవాడు. తనకు డబ్బులు ఇచ్చిన విద్యార్థుల దరఖాస్తులకు ఇతర విద్యార్థుల డీడీలను జత చేసిన విషయం వెలుగు చూడటంతో అతడిని అధికారులు సస్పెండ్‌ చేశారు. మూడేళ్ల కిందట ఎలాగోలా అతను అకౌంట్స్‌ విభాగంలో చేరాడు. రాజేశ్వర్‌రావుపై వర్సిటీ రిజిస్ట్రార్‌ వెంకటయ్య ఫిర్యాదు తో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాజేశ్వర్‌రావు పరారీలో ఉన్నట్లు తెలిసింది.  
మరిన్ని వార్తలు