15 రోజుల్లో 19 కేజీల బరువు తగ్గింపు

21 Apr, 2016 00:56 IST|Sakshi
15 రోజుల్లో 19 కేజీల బరువు తగ్గింపు

హిమాయత్‌నగర్ వాసికి ‘స్టార్’లో సర్జరీ.. ఎంపీ బూర వెల్లడి

 సాక్షి, హైదరాబాద్: ఓ వ్యక్తికి 15 రోజుల్లోనే 19 కేజీల బరువును విజయవంతంగా తగ్గించారు నగరంలోని స్టార్ ఆస్పత్రి వైద్యులు. బెరియాట్రిక్ సర్జరీ ద్వారా ఆ వ్యక్తి బరువును 205 కేజీల నుంచి 186 కేజీలకు తగ్గించారు. ఈ మేరకు బుధవారం బంజారాహిల్స్ స్టార్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ, ప్రముఖ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్  శస్త్రచికిత్స వివరాలు వెల్లడించారు. పదేళ్ల నుంచి ఊబకాయంతో బాధపడుతున్న హిమాయత్‌నగర్‌కు చెందిన సంయోద్దీన్(49) బూర నర్సయ్యగౌడ్‌ను ఆశ్రయించారు. వైద్యులు ఆయనకు ఈ నెల 6న బెరియాట్రిక్ సర్జరీ చేశారు.

శరీరం నుంచి గ్రాము కొవ్వు కూడా బయటికి తీయలేదు. జీర్ణాశయ పేగు సైజు తగ్గించడం వల్ల ఆహారం, నీరు ఎక్కువ తీసుకోలేరు. తద్వారా పొట్ట, నడుం, ఇతర భాగాల్లో పేరుకపోయిన కొవ్వు కరిగి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఇలా నెలకు సగటున ఆరు నుంచి ఏడు కేజీల చొప్పున బరువు తగ్గే అవకాశం ఉంది. ‘ప్రస్తుత జనాభాలో 10 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అధిక బరువు పరోక్షంగా మధుమేహం, హైపర్ టెన్షన్, శ్వాసకోశ సమస్యలు, ప్యాటీ లివర్, హృద్రోగ సమస్యలకు కారణమవుతోంది. వీరి పాలిట బెరియాట్రిక్ సర్జరీ ఓ వరం లాంటిది. బెరియాట్రిక్ చికిత్సలపై ప్రజల్లో ఇప్పటికీ కొన్ని అపోహలు ఉన్నాయి. అయితే ఇది చాలా సేఫ్ సర్జరీ’ అని డాక్టర్ నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు