ఉల్లంఘనులు యువతే టాప్

28 Feb, 2016 02:16 IST|Sakshi
ఉల్లంఘనులు యువతే టాప్

తీరు మార్చుకోని మందుబాబులు
57 రోజుల్లో 303 మందికి జైలు శిక్ష
3,112 కేసుల నమోదు
పట్టుబడిన వారిలో యువతే ఎక్కువ

 సాక్షి, సిటీబ్యూరో: మద్యం తాగాక వాహనం నడపొద్దని అంటే మందు బాబులు చిరాకు పడుతుంటారు. కచ్చితంగా నడిపి తీరాల్సిందేనని ఉబలాటపడుతుంటారు. వాహనాలపై రయ్యిమని దూసుకెళ్తూ సైబరాబాద్ పోలీసులకు చిక్కుతున్నారు. వీరిలో యువకులే ఎక్కువగా ఉండటం గమనార్హం. జరిమానాలు విధిస్తున్నా, జైలు పాలవుతున్నా వారిలో కొంతైనా మార్పు కనిపించడం లేదు. ఈ ఏడాది ప్రారంభమై రెండు నెలలు గడవక ముందే 3,112 కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. రాత్రి వేళల్లో పోలీసులు నిర్వహిస్తున్న ఆకస్మిక తనిఖీల్లో మందు బాబులు పెద్ద సంఖ్యలో పట్టుబడుతున్నారు. కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నా వరిలో పరివర్తన రాకపోవడం గమనార్హం.

 57 రోజుల్లో 303 మందికి జైలు శిక్ష
డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో చిక్కుతున్న వారిలో ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ఉంటున్నారు. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు 470 కేసులు నమోదు చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వారి నుంచి రూ. 4,16,300 జరిమానా వసూలు చేశారు. ఇందులో  భాగంగా 13 మందికి జైలు శిక్ష పడింది. జనవరి ఒకటి నుంచి  ఈ నెల 26 వరకు 3,112 కేసులు నమోదుకాగా, వీరి నుంచి రూ.44,40,250 జరిమానా వసూలు చేయగా, 303 మందికి జైలు పాలయ్యారు. ఈ కేసుల్లో పట్టుబడిన వారిలో 70 శాతానికి  పైగా యువకులే కావడం గమనార్హం.

గీత దాటుతున్నారు...
అవుటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) మార్గంలోనూ ట్రాఫిక్ ఉల్లంఘనుల సంఖ్య భారీగానే పెరిగింది. జనవరి ఒకటి నుంచి ఈ నెల 26 వరకు 2,819 కేసులు నమోదయ్యాయి. పెద్దంబర్‌పేట నుంచి శామీర్‌పేట, శంషాబాద్ మార్గంలో రాంగ్ పార్కింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ నుంచి ఎంట్రీ, అతివేగంతో డ్రైవింగ్, లేన్ అతిక్రమణలు ఎక్కువగా నమోదయ్యాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రచారం చేసినా వాహన చోదకుల్లో మార్పు రాకపోవడంతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు