ఇంటి సమస్యకు 3–డీ ప్రింటింగ్‌ పరిష్కారం

6 Apr, 2018 21:54 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మందికి పైగా తగిన ఇంటి వసతి లేకుండా బతుకు వెళ్లదీస్తున్నట్టు ‘వరల్ట్‌ రిసోర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌స్‌ రాస్‌ సెంటర్‌ ఫర్‌ సస్టయినబుల్‌ సిటీస్‌’నివేదిక వెల్లడించింది. అంటే ప్రపంచ జనాభాలో దాదాపు ఏడింట ఒకవంతు మంది ప్రజలకు కనీసం జీవించడానికి అవసరమైన  గూడు వంటి సౌకర్యం అందుబాటులో లేదు. అయితే ఇంత తీవ్రంగా మారిన ఇంటి సమస్య పరిష్కారానికి ‘ఐకాన్‌’ అనే లాభాపేక్ష లేని నిర్మాణ సాంకేతిక కంపెనీ ప్రపంచంలోనే తొలి 3–డీ (త్రీ డైమెన్షన్స్‌) ఇంటిని రూపొందించింది.

ఈ డిజైన్, సరళిలో అనుమతి సాధించిన మొదటి ఇల్లు గత నెలలో అమెరికా టెక్సాస్‌ రాజధాని ఆస్టిన్‌లో నిర్మితమైంది. అదీ కూడా 24 గంటల వ్యవధిలోనే... నాలుగు వేల డాలర్ల లోపు అయిన ఖర్చుతో... ఏదో ఇల్లు అనగానే చిన్న స్థలంలో, ఎలాంటి సౌకర్యాలు లేకుండా  ఇరుకు ఇరుకుగా నిర్మించినదై ఉంటుందని మనకు అనిపిస్తుంది. అయితే ఈ 3–డీ ఇళ్లు మాత్రం ఒక హాలు, పడక గది, స్నానపుగది,  ఆఫీసు కోసం ఉద్ధేశించిన చిన్న స్థలంతో కూడిన బాల్కనీ వంటివన్నీ ఇందులో  అమరిపోయాయట. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పేదలు ఎదుర్కుంటున్న గృహ సమస్య పరిష్కారానికి ఈ డిజైన్‌ దోహదపడుతుందని భావిస్తున్నారు.  ఈ ఇంటి కోసం తక్కువ స్థలమే అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. అతి తక్కువ సమయంలో నిర్మాణం పూర్తి చేసే అవకాశంతోపాటు , తక్కువ ఖర్చు కారణంగా డబ్బు ఆదా వంటి అంశాలు కలిసొస్తాయని చెబుతున్నారు.


ప్రస్తుతానికైతే ఐకాన్‌ సంస్థ ఆస్టిన్‌లోని  ఈ ఇంటిని నమూనా (ప్రోటోటైప్‌) గా ఉపయోగిస్తోంది. దీనిని తమ కార్యాలయంగా ప్రయోగాత్మకంగా ఉపయోగించడంతో పాటు ఓ మోడల్‌గా ప్రదర్శిస్తోంది. ఒక చిన్న కుటుంబం అవసరాలు తీరేలా 3–డీ ప్రింటింగ్‌ను ఉపయోగించి  ఇంటి డిజైన్‌ను రూపొందించిన కంపెనీ ఇదొక్కటే కాదు.   చైనా, ఇటలీ, రష్యాలలో ఇలాంటి కంపెనీలు ఈ ప్రింటింగ్‌తోనే డిజైన్లు రూపొందించాయి. దుబాయ్‌ కూడా 3–డీ ప్రింటింగ్‌తో భవనాలు నిర్మించేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు