'ఆ టెలిస్కోప్ మాకు వద్దే వద్దు'

10 Sep, 2015 11:39 IST|Sakshi
'ఆ టెలిస్కోప్ మాకు వద్దే వద్దు'

హొనోలులు: హవాయిలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాము ఎంతో పవిత్రంగా భావించే హవాయి పర్వతంపై టెలిస్కోప్ ఏర్పాటుచేయడానికి తాము ఒప్పుకోబోమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నవారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తితోపాటు ఏడుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు.  హవాయి పర్వతం మీద మొత్తం 30 మీటర్ల వ్యాసార్థంతో ఓ భారీ టెలిస్కోప్ ను ఏర్పాటుచేయనున్నారు. దీంతో మౌనాకియా అనే ప్రాంతాన్ని ది స్టేట్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ నేచురల్ రిసోర్సెస్ డిపార్ట్ ఆధీనంలోకి తీసుకుంది.

దాని చుట్టుపక్కల ఓ నియంత్రణ కంచెను ఏర్పాటుచేసి అటుపక్క ఎవరూ రాకుండా ముఖ్యంగా రాత్రి వేళ ఎవరూ సంచరించకుండా గస్తీ దళాన్ని కూడా పెట్టింది. అయితే, తాము పవిత్రంగా భావించే పర్వతాన్ని అధిరోహించకుండా చేస్తున్నారని, తమ సెంటిమెంట్ ను గౌరవించకుండా టెలిస్కోప్ ఏర్పాటుచేస్తున్నారని ఆందోళన ఉదృతం చేస్తున్నారు. గత అర్థ రాత్రి ఒంటిగంట ప్రాంతంలో మౌనాకియా వద్దకు కొందరు ఆందోళనకారులు చేరుకోగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, అరెస్టయిన వ్యక్తి బెయిల్ ఖర్చు రూ.70 వేలు ఉండగా మహిళల బెయిల్ కోసం ఒక్కొక్కరు దాదాపు 15 వేల రూపాయలకు పైగా చెల్లించాలని అధికారులు తెలిపారు. టెలిస్కోప్ నిర్మాణ పనులు గత ఏప్రిల్లో ప్రారంభమయ్యాయి.

మరిన్ని వార్తలు