జెఫ్‌ బెజోస్‌.. మోడ్రన్‌ కుబేర

18 Jul, 2018 01:05 IST|Sakshi
బెంగళూరులో అమెజాన్‌ సంస్థ కార్యక్రమంలో భాగంగా లారీ ఎక్కి ఫొటోలకు పోజిస్తున్న బెజోస్‌ (ఫైల్‌)

ఆధునిక ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు

150 బిలియన్‌ డాలర్లకు చేరిన సంపద విలువ  

న్యూయార్క్‌: ఆధునిక ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఈ–కామర్స్‌ సంస్థ అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్‌ బెజోస్‌(54) అవతరించారు. ఆయన సంపద మొత్తం విలువ సోమవారం నాటికి 150 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.10.25 లక్షల కోట్లు)కు చేరిందని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది.

ప్రఖ్యాత ఫోర్బ్స్‌ మేగజీన్‌ 1982 నుంచి ప్రతి ఏడాదీ ప్రపంచంలో అత్యధిక ధనవంతుల జాబితాను ప్రచురిస్తుండగా.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ జాబి తాలో పేర్కొన్న ఏ ఒక్క శ్రీమంతుడి సంపద విలువా 150 బిలియన్‌ డాలర్లకు చేరలేదు. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ సందర్భంగా స్టాక్‌మార్కెట్లలో అమెజాన్‌ షేర్ల ధరలు పెరగడంతో జెఫ్‌ బెజోస్‌ ఆధునిక కాలపు అత్యధిక ధనికుడిగా అవతారమెత్తారు.

సోమవారం అమెజాన్‌ షేర్‌ ధర 1,841.95 డాలర్ల రికార్డు స్థాయిని తాకింది. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌ ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో అమెజాన్‌ షేర్‌ ధర 1,800 డాలర్ల కన్నా తక్కువకు పడిపోయింది. దీంతో బెజోస్‌ సంపద 150 బిలియన్‌ డాలర్ల కన్నా కిందకు వచ్చింది.

కొన్ని ఆసక్తికర అంశాలు..
జెఫ్‌ బెజోస్‌ సంపద విలువ 150 బిలియన్‌ డాలర్ల వద్ద ఉన్నప్పుడు, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచంలో రెండో అత్యధిక సంపన్నుడు అయిన బిల్‌గేట్స్‌ సంపద విలువ 95.5 బిలియన్‌ డాలర్లు మాత్రమే.
   1999 కాలంలో డాట్‌ కామ్‌ బూమ్‌ సమయంలో బిల్‌ గేట్స్‌ సంపద వంద బిలియన్‌ డాలర్లకు చేరింది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని గేట్స్‌ నాటి సంపదను నేటి విలువతో పోల్చి చూసినా ఆయన మొత్తం ఆస్తి 149 బిలియన్‌ డాలర్లే అవుతుంది.
 జెఫ్‌ బెజోస్‌ తొలిసారిగా గతేడాది జూలైలోనే బిల్‌గేట్స్‌ను దాటి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు.
    బిల్‌గేట్స్‌ సేవా కార్యక్రమాలకు తన సంపదను దానం చేయకుండా ఉండి ఉంటే 150 బిలియన్‌ డాలర్ల మార్కును ఆయన గతంలోనే చేరి ఉండేవారు.
    బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌కు 70 కోట్ల మైక్రోసాఫ్ట్‌ షేర్లను ఆయన దానమిచ్చారు. 1996 నుంచి ఇప్పటి వరకు 2.9 బిలియన్‌ డాలర్ల డబ్బును, కొన్ని ఆస్తులను కూడా ఆయన ఫౌండేషన్‌కు ధారపోశారు. ఆయన దానం చేసిన ఆస్తులు, షేర్లు, డబ్బు విలువ 35 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా.
    జాబితాలో 83 బిలియన్‌ డాలర్ల సంపదతో వారెన్‌ బఫెట్‌ మూడో స్థానంలో ఉన్నారు.
    ఈ ఒక్క ఏడాదిలోనే జెఫ్‌ బెజోస్‌ సంపద 52 బిలియన్‌ డాలర్లు పెరిగింది. అలీబాబా గ్రూప్‌ చైర్మన్‌ జాక్‌ మా మొత్తం ఆస్తి కన్నా ఇది ఎక్కువే. అలాగే ఆసియాలోనే అత్యంత ధనికుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మొత్తం సంపద విలువ (జూలై 13 నాటికి 44.3 బిలియన్‌ డాలర్లు) కన్నా కూడా ఇది ఎక్కువే.
    ప్రపంచంలోనే ధనిక కుటుంబం వాల్టన్‌ ఫ్యామిలీ మొత్తం ఆస్తి విలువ 151.5 బిలియన్‌ డాలర్లు కాగా, జెఫ్‌ బెజోస్‌ ఒక్కడి ఆస్తే 150 బిలియన్‌ డాలర్లు.

మరిన్ని వార్తలు