సౌదీలో మహిళల డ్రైవింగ్‌కు అనుమతి

28 Sep, 2017 02:10 IST|Sakshi

రియాద్‌: సౌదీ అరేబియాలో మహిళలు డ్రైవింగ్‌ చేయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఆ దేశం నిర్ణయించింది. ఇకపై డ్రైవింగ్‌ చేసేందుకు మహిళలను అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సౌదీ రాచకుటుంబం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు 2018 జూన్‌ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మహిళలు డ్రైవింగ్‌ చేయడాన్ని సౌదీ గతంలో నిషేధించింది.

ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని దాదాపు మూడు దశాబ్దాల నుంచి మహిళలు, హక్కుల కార్యకర్తలు ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగొచ్చిన ప్రభుత్వం.. నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ ఆదేశాలు వెంటనే కాకుండా.. 2018 జూన్‌ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఆదేశాల అమలుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నామని పేర్కొంది.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సౌదీలో మహిళల అభివృద్ధికి ఓ గొప్ప ముందడుగు అని సౌదీ యువరాజ్‌ ఖలీద్‌ బిన్‌ సల్మాన్‌ పేర్కొన్నారు. సౌదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసించారు. సౌదీలో మహిళల హక్కులు, అవకాశాలను ప్రోత్సహించేందుకు ఇదొక సానుకూల చర్యగా ఆయన పేర్కొన్నారు. సౌదీ ప్రభుత్వం గొప్ప ముందడుగు వేసిందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ పేర్కొన్నారు. మహిళలకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్న సౌదీ అరేబియాను బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే ప్రశంసించారు.  

మరిన్ని వార్తలు