ఆయనకు ఒంట్లో ఆల్కహాల్‌!

27 Oct, 2019 04:41 IST|Sakshi

న్యూయార్క్‌: బయటకెళ్లి ఆల్కహాల్‌ కొనకుండా ఇంట్లోనే ఆల్కహాల్‌ దొరికితే ఎంత బావుండునో అని మద్యపాన ప్రియులు కోరుకుంటారు. అలాంటిది ఏకంగా ఒంట్లోనే ఆల్కహాల్‌ ఉత్పత్తి అయితే ఇంకెంత బాగుండు అనుకుంటారు కదా! అతడెంత అదృష్టవంతుడోనని ఆశ్చర్యపోతారు. దీన్ని అనుభవిస్తున్న ఓ వ్యక్తి మాత్రం దీన్ని దురదృష్టకరమని భావిస్తున్నాడు. న్యూయార్క్‌కు చెందిన ఓ వ్యక్తి డ్రైవింగ్‌ చేస్తుండగా ఆపి ఆల్కహాల్‌ స్థాయిని పరీక్షించారు. ఉండాల్సిన స్థాయి కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అధికారులు అతన్ని అరెస్ట్‌ చేసి కోర్టులో నిలబెట్టారు. అయితే ఇలాంటి ఓ కేసు గురించి విన్న అతని బంధువు అతడికి సహాయం చేసింది.

ఆహారంలో ఉన్న పిండిపదార్థాలను గ్లూకోజ్‌గా కాకుండా, ఆల్కహాల్‌గా మార్చే ఓ ప్రత్యేక సూక్ష్మజీవి కడుపులో ఉండటంతో  ఈ పరిస్థితి ఎదురైంది. ఓ డాక్టర్‌ పర్యవేక్షణలో అతడిని ఉంచారు. అధిక పిండిపదార్థాలు ఉన్న ఆహారాన్ని అతడు తీసుకున్నపుడు రక్తంలో ఆల్కహాల్‌ స్థాయి  పెరగడాన్ని గుర్తించారు. పిండిపదార్థాలు అధికంగా లేని ఆహారాన్ని స్వీకరించినపుడే ఆల్కహాల్‌ స్థాయి లేదు. దీంతో అతన్ని కోర్టు మన్నించింది. ఈ అంతుచిక్కని వ్యాధి పరిశీలన దశలోనే ఉందని పరిశోధకులు బార్‌బరా కార్డెల్‌ అన్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు ఆల్కహాల్‌ సేవించినట్లు కనిపిస్తారు. ఆల్కహాల్‌ వాసన వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది షుగర్‌ వ్యాధి ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు