మేఘం మురిసెను..మద్యం కురిసెను!

30 Mar, 2017 05:12 IST|Sakshi
మేఘం మురిసెను..మద్యం కురిసెను!

బెర్లిన్‌: వర్షంగా మద్యం కురిస్తే మద్యం ప్రియులు ఎగిరి గెంతేయడం ఖాయం. మెక్సికోలో పర్యాటకులను ఆకర్షించేందుకు లాపీజ్‌ అనే సంస్థ టకీలా (నీలం అగేవ్‌ మొక్కలతో చేసే ఒక రకమైన మద్యం) మేఘాన్ని సృష్టించింది. లియో బోర్నెట్‌ అనుబంధ సంస్థ లాపీజ్‌ ‘అల్ట్రాసోనిక్‌ హ్యుమిడీఫైర్స్‌’ ఉపయోగించి టకీలాను ప్రకంపనల ద్వారా మేఘంగా మార్చింది. ఈ మేఘం నుంచి చినుకులుగా టకీలా కురుస్తుంది. దీన్ని పర్యాటకులు నేరుగా తమ గ్లాసుల్లోకి పట్టుకుని తాగుతారు.

జర్మనీ రాజధాని బెర్లిన్‌లో టకీలా మేఘాన్ని మెక్సికో పర్యాటకశాఖ ప్రదర్శించింది. అయితే ఇటువంటి మేఘాలతో చాలా మద్యం వృథా అవుతుందని పలువురు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తపరుస్తుండగా...టకీలా ప్రియులు మాత్రం వర్షంలా కురిసే టకీలాను తెగ ఇష్టపడుతున్నారని పర్యాటక శాఖ వివరించింది.

ఎడారిలో మర్రిచెట్టు!
బహ్రెయిన్‌: భారత్‌ లాంటి దేశాల్లో ఏ గ్రామంలోకి వెళ్లినా మర్రిచెట్లు దర్శనమిస్తుంటాయి. ఒక్క ఎడారుల్లో తప్పా! ఎడారి ప్రాంతాల్లో చుక్కనీరు కావాలంటే ఒయాసిస్సుల వెంట పరు గులు పెట్టాల్సిందే. ఇక మొక్కల సంగతి అంటారా..సరేసరి! అక్కడ వాతా వరణానికి తట్టుకునే మొక్కలు మాత్రమే ఎడారుల్లో పెరుగుతుంటాయి. కానీ బహ్రెయిన్‌ దేశంలో మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఓ మర్రిచెట్టు 400 సంవ త్సరాలుగా ఎండిపోకుండా పచ్చగా ఉండి పర్యాటకులను విశేషంగా ఆకర్షి స్తుంది. అస్కర్, జా అనే ప్రదేశాల మధ్యనున్న 32 అడుగుల ఈ మర్రిచెట్టుని ‘ట్రీ ఆఫ్‌ లైఫ్‌’ గా స్థానికులు పిలుస్తారు. ఈ చెట్టు చుట్టుపక్కల కొన్ని మైళ్ల వరకు నీరు ఉండటానికిగానీ, చెట్టు బతకడానికి గానీ అనువైన పరిస్థితుల్లేవు. అందుకే ఈ చెట్టుని మర్మమైన మర్రిచెట్టుగా...పురాణ ఇతిహాస చెట్టుగా అక్కడి వారు అభివర్ణిస్తుంటారు. ఇంతకీ ఈ చెట్టు ఎప్పటిదో చెప్పలేదు కదూ! దీన్ని 1583లో నాటారని...అప్పటి నుంచి ఎండి పోకుండా పచ్చగా ఉందని స్థానికులు చెబుతుంటారు. ఏటా ఈ చెట్టుని చూడటానికి సుమారు లక్ష మంది వరకు పర్యాటకులు వస్తుంటారని బహ్రెయిన్‌ పర్యాటక శాఖ పేర్కొంది.

మరిన్ని వార్తలు