పెట్టుబడుల కోసం పాక్‌ ‘బెల్లీ డ్యాన్స్‌’

9 Sep, 2019 16:36 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : రోజు రోజుకు అప్పుల్లో కూరుకుపోతున్న పాకిస్తాన్‌ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి చేసిన ఓ ప్రయత్నం తీవ్ర విమర్శలకు గురైంది. పాకిస్తాన్‌కు చెందిన సర్హాద్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(ఎస్‌సీసీఐ) ఓ పెట్టుబడి సదస్సును అజర్‌ బైజాన్‌ దేశ రాజధాని బకూలో నిర్వహించింది. ఖైబర్‌ పక్తుంఖ్వా పెట్టుబడి అవకాశాల సదస్సు పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం సెప్టెంబర్‌ 4 నుంచి 8 మధ్య జరిగింది. అయితే అక్కడికి వచ్చిన పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఈ కార్యక్రమంలో బెల్లీ డాన్స్‌ను ఏర్పాటు చేసింది.  దీనిని పాక్‌ జర్నలిస్టు ఒకరు.. వీడియోతో సహా ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.

పెట్టుబడిదారులను బెల్లీ డాన్సులతో ఆకర్షించడానికి ప్రయత్నించినపుడు... అనే శీర్షికతో ఈ వీడియోను అప్‌లోడ్‌ చేయడంతో క్షణాల్లో వైరల్‌ అయింది. పాకిస్తాన్‌ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడానికి ఇంత దిగజారాలా? అని సోషల్‌ మీడియా వేదికగా పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. నయా పాకిస్తాన్‌ అని తరచూ ఉద్భోద చేసే మన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ దృష్టిలో ‘నయా పాకిస్తాన్‌’ అంటే ఇదే కాబోలు అని ఓ పాక్‌ ట్విటర్‌ యూజర్‌ వ్యాఖ్యానించగా.. ఎందుకు ఆ పెట్టుబడుల సదస్సు ఇక్కడ ఉన్న బర్రెలను, గొర్రెలను అమ్ముకోవడానికా.. అంతకన్నా ఇక్కడ ఏం లేదు అని మరో నెటిజన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడులను ఆకర్షించడానికి పాకిస్తాన్‌ ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ చేసేకన్నా కొత్తగా ఆలోచిస్తే బాగుండేది అని, అయినా ఈ సదస్సులో బెల్లీ డ్యాన్స్‌ మాత్రమే హైలెట్‌ కాబోలు అని వ్యంగ్యంగా  కొందరు కామెంట్లు పెడుతున్నారు.

కాగా, పాకిస్తాన్‌ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్న సంగతి తెలిసిందే. పాక్‌ను ఆదుకోవడానికి చైనా, సౌదీ ఆరేబియా, యూఏఈలు బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీలు ప్రకటించినా అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. గ్యాస్‌, చమురు ధరలు, విద్యుత్‌ బిల్లులు రోజురోజుకు పెరిగిపోయి సామాన్యునిపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

 చదవండి : పాక్‌లో చైనా పెట్టుబడులు

మరిన్ని వార్తలు