గ్రీన్‌కార్డు కోటా పెంపు

12 Jan, 2018 02:15 IST|Sakshi

ఏటా 1.75 లక్షల కార్డుల జారీ!

ప్రతినిధుల సభలో సంబంధిత బిల్లు

భారత ఐటీ నిపుణులకే అధిక ప్రయోజనం

వాషింగ్టన్‌: అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు శుభవార్త. అక్కడ ఉద్యోగంతో పాటు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునేందుకు దోహదపడే గ్రీన్‌కార్డు కోటాను గణనీయంగా పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ప్రతిభ ఆధారిత వలస విధానాలను ప్రోత్సహించే ఈ బిల్లుకు ట్రంప్‌ ప్రభుత్వ మద్దతు కూడా ఉంది. ఇది చట్టంగా మారితే భారత్, చైనా లాంటి దేశాల సాఫ్ట్‌వేర్‌ నిపుణులకు అధిక ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు.

‘సెక్యూరింగ్‌ అమెరికాస్‌ ఫ్యూచర్‌ యాక్ట్‌’ పేరిట రూపొందించిన ఈ బిల్లులో ఏటా ఇస్తున్న గ్రీన్‌కార్డుల కోటాను  45 శాతం.. అంటే ప్రస్తుతమున్న 1.20 లక్షల నుంచి 1.75 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. అనధికారిక అంచనాల ప్రకారం..ప్రస్తుతం అమెరికాలో సుమారు 5 లక్షల మంది భారతీయులు గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తూ ఏటా హెచ్‌–1బీ వీసాలను పొడిగించుకుంటున్నారు. కొందరైతే దశాబ్దాలుగా గ్రీన్‌కార్డు కోసం నిరీక్షిస్తున్నారు. హెచ్‌–1బీ వీసాపై అమెరికాకు వచ్చి, శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డు కోరుకునే అర్హులైన ఐటీ నిపుణులకు ఈ బిల్లు వరం కానుంది. ఏటా జారీచేసే ఈ కార్డుల సంఖ్య పెరిగితే వారు అందుకోసం ఎదురుచూసే సమయం తగ్గిపోతుంది.  

తల్లిదండ్రులకు తాత్కాలిక వీసానే...
గొలుసుకట్టు వలస విధానాన్ని(చైన్‌ ఇమిగ్రేషన్‌) ఎత్తివేయాలని అందులో ప్రతిపాదించడం వల్ల జీవిత భాగస్వామి, మైనర్‌ పిల్లలు మినహా మిగతా కుటుంబ సభ్యులను అమెరికాకు తీసుకెళ్లడం కుదరదు. అయితే గ్రీన్‌కార్డు కలిగి ఉన్న పౌరులను కలుసుకునేలా వారి తల్లిదండ్రులకు  పునరుద్ధరించడానికి వీలుపడే తాత్కాలిక వీసా కార్యక్రమాన్ని అమలుచేయనున్నారు. వ్యవసాయ కార్మికులు తాత్కాలికంగా అక్కడికి వెళ్లి పనిచేయడానికి వీలు కల్పించే కార్యక్రమాన్ని కూడా బిల్లులో ప్రతిపాదించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసం విదేశీ కార్మికుల సేవలు వాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘వైట్‌హౌస్‌’కు అనుగుణంగానే..
ప్రతిభ ఆధారిత వలస విధానాల వల్ల మెరికల్లాంటి నిపుణులే దేశానికి వస్తారని, అక్రమంగా ప్రవేశించే వారికి అడ్డుకట్ట పడుతుందని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన వారిలో ఒకరైన హౌజ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ కమిటీ చైర్మన్‌ మైకేల్‌ మెక్‌కౌల్‌ స్పందిస్తూ దేశ సరిహద్దులను రక్షించేలా బిల్లు ఉందని అన్నారు. దేశ భద్రతకు సైన్యం చేస్తున్న కృషి, అంతర్గత చట్టాల అమలుకు మద్దతుగా నిలుస్తూ, వలస విధానాలను ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరించేలా నిబంధనలు చేర్చామని తెలిపారు.

భారతీయుల స్టోర్లపై దాడులు
అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా అమెరికా అధికారులు భారతీయులకు చెందిన సుమారు 100 7–ఎలెవన్‌ రిటైల్‌ దుకాణాలపై దాడులు నిర్వహించి 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా వలసొచ్చిన వారిని ఉద్యోగాల్లో నియమించుకోవద్దని నిర్వాహకులను హెచ్చరించారు. 18 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియాలో ఈ దాడులు నిర్వహించారు. అరెస్టయిన వారు ఏ దేశస్తులో వెల్లడికాలేదు. అమెరికాలో ఇండో–అమెరికన్లే 7–ఎలెవన్‌ పేరిట ఎక్కువగా రిటైల్‌ దుకాణాలను నిర్వహిస్తున్నారు.  

మరిన్ని వార్తలు