పట్నమెళ్లి పోతున్నారు!

29 Nov, 2017 01:11 IST|Sakshi

2030 నాటికి భారత్‌లో 40 శాతం జనం పట్టణాల్లోనే

2050కి పల్లెల్లో మిగిలే జనాభా 45 శాతం లోపే

ఉద్యోగావకాశాల కోసం కావొచ్చు లేదా సకల సౌకర్యాలుగల జీవన విధానం కోసం కావొచ్చు...కారణం ఏదైనా ఆసియా దేశాల్లో పల్లెల నుంచి పట్టణాలు, నగరాలకు వలసపోతున్న ప్రజల సంఖ్య  వేగంగా పెరుగుతోంది. భారత్, చైనా, ఇండోనేసియా, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్‌ దేశాల నుంచి దాదాపు 30 కోట్ల జనం వచ్చే పదేళ్లలో గ్రామాలను విడిచి పట్టణాల బాట పడతారని అమెరికాకు చెందిన ప్రఖ్యాత అధ్యయన సంస్థ బ్రూకింగ్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌ అధ్యయనంలో తేలింది. ఆసియా దేశాల్లో, ప్రత్యేకించి భారత్‌లో పట్టణీకరణ మరింత వేగమందుకుంది. ప్రజల ఆదాయాలు పెరిగి సమాజంలో మధ్యతరగతి వారి సంఖ్య సింహభాగానికి చేరుకుంటోంది.   

ఆసియాలో 24.. అమెరికాలో రెండే
2014–50 మధ్య కాలంలో చైనా, భారత్‌లలో కలిపి కొత్తగా 70 కోట్ల జనం గ్రామాల నుంచి పట్టణాలకు తరలిపోయి మధ్య ఆదాయవర్గంగా ఎదుగుతారని హోమీ ఖరాస్‌ అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ఆసియాలో ప్రస్తుతం సగానికి పైగా ఉన్న గ్రామీణ జనాభా 2050 నాటికి 45 శాతం కంటే దిగువకు పడిపోతుంది.

ఆసియాలో 2016 నాటికి పది లక్షలకు మించి జనాభా ఉన్న నగరాలు 275. పుష్కర కాలం తర్వాత ఆ సంఖ్య 354కు పెరుగుతుందని భావిస్తున్నారు. కోటి జనాభా దాటిన మహానగరాలు 2030కి ఆసియాలో 24కి పెరుగుతాయని, అమెరికాలో మాత్రం వీటి సంఖ్య రెండు దగ్గరే ఆగిపోతుందని అంచనా.

అలాగే కొత్తగా వలస వచ్చే వారికోసం పట్టణాల్లో గృహనిర్మాణం, కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, దుకాణాలు తదితర సదుపాయాల కల్పనకు 10,400 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందని భావిస్తున్నారు. తత్ఫలితంగా రియల్‌ ఎస్టేట్‌(ఖాళీ స్థలాలు, భవనాలు) రంగానికి  డిమాండ్‌ ఉంటుందంటున్నారు నిపుణులు. పట్టణాలకు చేరే జనాభా అవసరాలను తీర్చడానికి మానవ వనరులు అవసరం కాబట్టి కొత్తగా ఉద్యోగాల కల్పన  జరుగుతుందని భావిస్తున్నారు.    


2030 నాటికి అతిపెద్ద మార్కెట్‌గా భారత్‌
ఓ అంచనా ప్రకారం మధ్యతరగతి జనాభా విషయంలో 2027 కల్లా ఇండియా చైనాను వెనక్కు నెట్టనుంది. భారత్‌లో పట్టణీకరణ ప్రత్యేక లక్షణాలను సంతరించుకుంటోంది. ఇదే ఒరవడి కొసాగితే 2030 నాటికి దేశం మొత్తం జనాభాలో పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు 40 శాతం ఉంటారని బ్రూకింగ్స్‌ చెబుతోంది.

ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న వస్తువులు, సేవల్లో 60 శాతం వరకు పట్టణాల్లోని ప్రజలే కొంటున్నారు. అలాగే 2030 నాటికి చైనా, అమెరికాలను సైతం దాటి భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల మార్కెట్‌గా అవతరిస్తుందని బ్రూకింగ్స్‌కు చెందిన హోమీ ఖరాస్‌ చెబుతున్నారు.

 – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు