పెద్ద గీత.. చిన్న గీత కాబోతోంది!

24 Aug, 2017 04:14 IST|Sakshi
పెద్ద గీత.. చిన్న గీత కాబోతోంది!

ప్రపంచంలోనే ఎత్తైన భవనం ఏది? దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా! కానీ ఈ ముచ్చట ఇంకో మూడేళ్లే! బుర్జ్‌ ఖలీఫాకు కొంచెం దూరంలోనే ఇంకో ఎత్తైన భవనాన్ని కట్టేసి దుబాయి తన రికార్డును తానే బద్ధలు కొడుతోంది. మల్లెపూవు ఆకారాన్ని పోలినట్టు ఉండే ఆ భవనం ఎలా ఉండబోతోందో ఫొటోలో చూడవచ్చు. దుబాయ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ ఈ ఎత్తైన భవంతిని కడుతోంది. డిజైన్‌ చేసింది శాంటియాగో కలట్రావాస్‌ అనే ఆర్కిటెక్చర్‌ సంస్థ. దాదాపు ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కట్టే ఈ భవనం ఎత్తు దాదాపు 3,045 అడుగులు. బుర్జ్‌ ఖలీఫా కంటే 300 అడుగులు ఎక్కువ. దుబాయ్‌ అంటేనే ఏడారి దేశం కాబట్టి.. ఇసుక నేలలపై భవనాలు కట్టడం అంత ఆషామాషీ ఏం కాదు.

అందుకే ఈ కొత్త భవనానికి పునాది ఎంత గట్టిగా వేశారంటే.. అది కాస్తా 236 అడుగుల లోతుకు చేరేంత. పైగా ఒక్క పునాదుల్లోనే దాదాపు 16 లక్షల ఘనపుటడుగుల కాంక్రీట్‌ను దిమ్మరించారు. ఇక ఈ భవనానికి ఉన్న మరో ప్రత్యేకత... దీనికి ఊతమిచ్చేందుకు దాదాపు 110 కిలోమీటర్ల పొడవైన ఇనుపతీగలను వాడటం. బలమైన గాలులకు భవనం ఊగిపోకుండా అన్నమాట! అన్నీ బాగానే ఉన్నాయిగానీ దీంట్లో ఏముంటాయి? దుబాయ్‌ మొత్తాన్ని పై నుంచి చూసేందుకు పది వరకూ అబ్జర్వేషన్‌ డెక్స్‌ ఉంటాయి. అంతేకాకుండా బాబిలోనియాలోని వేలాడే ఉద్యానవనాల మాదిరిగా దీంట్లోనూ బోలెడన్ని మొక్కలు, పచ్చదనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బిల్డింగ్‌ లోపల చల్లగా ఉంచేందుకు అత్యంత çసమర్థవంతమైన వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా సేకరించే నీటితో బిల్డింగ్‌ ముందుభాగాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా ఏర్పాట్లు ఉన్నాయి. దీంట్లో ఉన్న కొన్ని బాల్కనీలు అవసరమైనప్పుడు బిల్డింగ్‌ బయటభాగానికి వచ్చేస్తాయి. ఆ తరువాత లోనికి తిరిగేస్తాయి. గత ఏడాది ఈ భవన నిర్మాణం మొదలుకాగా.. ఇంకో మూడేళ్లలో అంటే 2020లో జరిగే దుబాయ్‌ ఎక్స్‌పో సమయానికి నిర్మాణం పూర్తి అవుతుందని అంచనా.  
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు