చింపాంజీలు కూడా వంట చేస్తాయట...

5 Jun, 2015 08:45 IST|Sakshi
చింపాంజీలు కూడా వంట చేస్తాయట...

సాక్షి: ఈ భూమ్మీద మానవుల్తో దగ్గరి పోలికలు కలిగిన జీవి చింపాజీ. ఇవి మనుషులు చేయగలిగిన అనేక పనులను నిర్వహించే సామర్థ్యం కలిగి ఉన్నట్లు అనేక పరిశోధనల్లో రుజువైంది. చింపాంజీల మీద ఈ విషయమై పలు పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చింపాంజీల సామర్థ్యం గురించి మరో విషయం బయటపడింది. ది రాయల్ సొసైటీకి చెందిన పరిశోధకులు వెల్లడించిన నివేదిక ప్రకారం చింపాంజీలు కూడా మనుషుల్లాగే వంట చేయగలవట. వాటికి వండటం నేర్పిస్తే అవి నేర్చుకోగలవని ఆ అధ్యయనం వెల్లడించింది. అన్ని చింపాంజీలు వంట చేయలేకపోయినా కనీసం మైక్రోవేవ్‌ని వాడగలిగే శక్తి మాత్రం ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు.

ఆహార పదార్థాల్ని వండి తినగలిగే ఏకైక లక్షణం మానవులకు మాత్రమే ఉంది. కానీ చింపాంజీల్లో ఉన్న సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు వాటికి కొన్ని పరీక్షలు నిర్వహించారు. వండిన ఆహార పదార్థాలు తినడం వాటికి అలవాటు చేశారు. దీని వల్ల పచ్చి ఆహారం కన్నా వీటికే అవి ఎక్కువగా అలవాటు పడిపోయాయి. చివరికి వాటికి మెల్లగా వండడం నేర్పించారు. వండిన ఆహారాన్ని తినడానికి అలవాటు పడిన చింపాంజీలు సొంతంగా వండుకునే పరిస్థితుల్ని కలిగించారు. దీంతో అవి కనీసం మంటల్లో ఆహారాన్ని వేడి చేసి తినగలిగే స్థితికి చేరుకున్నాయి. మైక్రోవేవ్ లాంటి పరికరాన్ని చింపాంజీలకు ఇచ్చారు. దీనికోసం ‘చింపాంజీ మైక్రోవేవ్’ అనే పరికరాన్ని వారు రూపొందించారు. ఇందులో అవి ఆహారాన్ని ఉంచి, అది వేడెక్కిన తర్వాతే తినడం మొదలెట్టాయి. దీన్ని బట్టి చింపాంజీలకు కూడా వంట చేసి తినగలిగే సామర్థ్యం ఉన్నట్లు తేలిందని పరిశోధకులు తెలిపారు.

మరిన్ని వార్తలు