ఉత్తర కొరియాకు చైనా షాక్‌

24 Sep, 2017 18:47 IST|Sakshi

చమురు ఉత్పత్తుల ఎగుమతిపై పరిమితులు

వస్త్ర దిగుమతులను పూర్తిగా నిలిపివేసిన డ్రాగన్‌ 

బీజింగ్‌: ఉత్తర కొరియాకు తన మిత్ర దేశమైన చైనా గట్టి షాక్‌ ఇచ్చింది. ఆ దేశం నుంచి వస్త్ర ఉత్పత్తులను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించింది. అంతేగాకుండా చమురు ఎగుమతులపై పరిమితులు విధించింది. ఇందులోభాగంగా ద్రవీకృత సహజ వాయువును ఉత్తర కొరియాకు ఎగుమతి చేయడాన్ని శనివారం నుంచే నిలిపివేస్తున్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. క్షిపణి ప్రయోగాలు, అణు పరీక్షలు వరుసగా నిర్వహించి ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్న ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే పరిమితులు విధించినట్లు చైనా స్పష్టం చేసింది.

శుద్ధి చేసిన చమురు ఎగుమతులపై అక్టోబర్‌ 1వ తేదీ నుంచి పరిమితులు కొనసాగు తాయని పేర్కొంది. దీంతో శుద్ధి చేసిన చమురు ఎగుమతులను సంవత్సరానికి 20 లక్షల బ్యారెల్స్‌కు పరిమితం చేసినట్లు స్పష్టం చేసింది. వస్త్ర దిగుమతులను శనివారం నుంచే నిలిపి వేస్తున్నట్లు తెలిపింది. వీటితోపాటు బొగ్గు, ఇనుము, ఇతర వస్తువుల దిగుమతులను కూడా నిలిపివేసింది. తాజాగా పలు దిగుమతులపై చైనా నిషేధం విధించడంతో ఉత్తర కొరియాపై తీవ్ర ఆర్థిక ప్రభావం పడవచ్చని భావిస్తున్నారు.  

>
మరిన్ని వార్తలు