World Coffee Portal: కాఫీకి చైనా జై

15 Dec, 2023 01:54 IST|Sakshi

అమెరికా కంటే చైనాలోనే అత్యధిక కాపీ ఔట్‌లెట్లు 

‘వరల్డ్‌ కాఫీ పోర్టల్‌’ సర్వేలో వెల్లడి   

తేనీరు... ప్రపంచంలో ఈ పానీయం గురించి తెలియనివారు ఉండరు. తేనీరు డ్రాగన్‌ దేశం చైనాలో పుట్టిందన్న వాదన కూడా ఉంది. ఈ ఉష్ణోదకం సేవించడంలో చైనీయులు ముందంజలో ఉంటారు. కానీ, ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. చైనా ప్రజలు ఇప్పుడు కాఫీపై మక్కువ పెంచుకుంటున్నారు. సాక్షాత్తూ ‘వరల్డ్‌ కాఫీ పోర్టల్‌’ నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం బహిర్గతమైంది.

బ్రాండెడ్‌ కాఫీ షాప్‌ మార్కెట్‌ విషయంలో అమెరికాను చైనా మించిపోయిందని ‘వరల్డ్‌ కాఫీ పోర్టల్‌’ వెల్లడించింది. అమెరికాలో కంటే చైనాలోనే అత్యధిక కాఫీ ఔట్‌లెట్లు ఉన్నాయని తెలియజేసింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తున్న చైనాలో కాఫీ ప్రేమికుల పెరిగిపోతోందని, కేవలం గత 12 నెలల వ్యవధిలోనే కాఫీ ఔట్‌లెట్ల సంఖ్య 58 శాతం పెరిగిందని పేర్కొంది. ప్రసుతం చైనాలో 49,691 బ్రాండెడ్‌ కాఫీ దుకాణాలు ఉన్నాయని వివరించింది.  

► ప్రఖ్యాత స్టార్‌బక్స్‌ సంస్థ గత ఏడాది వ్యవధిలో చైనాలో కొత్తగా 785 కాఫీ దుకాణాలు తెరిచింది. చైనాలో రూ.1,660 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టింది. అమెరికా బయట స్టార్‌బక్స్‌ ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా తమకు రెండో అతిపెద్ద మార్కెట్‌ చైనాయేనని స్టార్‌బక్స్‌ స్పష్టం చేసింది.  
► చైనాలో కాఫీలను విక్రయించడంలో స్టార్టప్‌ కంపెనీ ‘లకిన్‌ కాఫీ’దే పైచేయి. ఈ సంస్థకు దేశంలో 13,000కుపైగా ఔట్‌లెట్లు ఉన్నాయి.  
► సర్వేలో భాగంగా 4,000 మంది కాఫీ ప్రియులను ప్రశ్నించారు. వీరిలో 90 శాతం మంది వారానికోసారి హాట్‌ కాఫీ తాగుతామని చెప్పారు. వారానికి ఒక్కసారైనా ఐస్డ్‌ కాఫీ తీసుకుంటామని 64 శాతం మంది తెలిపారు.  
► ప్రతివారం కాఫీ షాప్‌నకు వెళ్తాం లేదా ఆర్డర్‌ చేసి తెప్పించుకుంటామని 90 శాతం మంది వెల్లడించారు.  
► చైనాలో ఇటీవలికాలంలో ఆర్థిక ప్రగతి కొంత నెమ్మదించింది. అయినప్పటికీ ప్రపంచ కాఫీ పరిశ్రమగా చైనా ఎదుగుతుండడం విశేషం.  
► చైనాలో తమ కంపెనీ ప్రస్థానం ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని స్టార్‌బక్స్‌ సీఈఓ లక్ష్మణ్‌ నరసింహన్‌ చెప్పారు. 2025 నాటికి చైనాలో 9,000 కాఫీ దుకాణాలు ప్రారంభించాలని స్టార్‌బక్స్‌ లక్ష్యంగా పెట్టుకుంది.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

>
మరిన్ని వార్తలు