ఆయన కుటుంబానికి చైనా ప్రభుత్వం క్షమాపణలు

21 Mar, 2020 10:40 IST|Sakshi
డా.లి వెన్‌లియాంగ్‌ (ఫైల్‌)

బీజింగ్‌ : కరోనా వైరస్‌ గురించి ప్రజల్ని హెచ్చరించి జైలుపాలైన డాక్టర్‌ లి వెన్‌లియాంగ్‌ కుటుంబసభ్యులకు అధికార కమ్యూనిస్టు పార్టీ క్షమాపణలు చెప్పింది. గత డిసెంబర్‌లో వూహాన్‌కు చెందిన డా. లి  సార్స్‌ లాంటి వైరస్‌ వూహాన్‌లో రాబోతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోషల్‌ మీడియా ద్వారా ప్రజల్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో ఏడుగురు కూడా ఇందుకు సంబంధించిన పోస్టులు చేశారు. దీంతో వాటిని వదంతులుగా భావించిన పోలీసులు వారిపై కేసు నమోదుచేసి అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత కరోనా వైరస్‌ బారిన పడిన లీ చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఆయన మరణించిన కొద్దిరోజులకే తీవ్ర స్థాయిలో విజృంభించిన వైరస్‌ దేశంలో అల్లకల్లోలం సృష్టించింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు దాదాపు  3,245 మంది మరణించారు. రాజీలేని నివారణ చర్యల అనంతరం వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలిగారు.

కొద్దిరోజుల క్రితం డా. లీ హెచ్చరికల కేసుపై విచారణ జరిపిన సుప్రీం పీపుల్స్‌ కోర్టు వారి హెచ్చరికలు వదంతులు కావని తేల్చింది. వూహాన్‌ పోలీసుల తీరును ఖండించింది. ఈ నేపథ్యంలో అధికార కమ్యూనిస్టు పార్టీ డా. లీ విషయంలో తమ పొరపాటుకు చింతిస్తూ ఆయన కుటుంబానికి అధికారికంగా క్షమాపణలు తెలిపింది. ఆయన అంత్యక్రియలకు సంబంధించి ఆర్థిక సహాయం చేసింది. ఆయన మృతిని ‘వర్క్‌ ప్లేస్‌ ఇంజ్యూరీ కాంపెన్సేషన్‌‌’ కింద పరిగణిస్తామని పేర్కొంది. డా. లీతో పాటు మిగిలిన ఏడుగురిపై కేసులు పెట్టిన పోలీసుల తీరును సైతం తప్పుబడుతూ వారిపై చర్యలకు సిద్ధమైంది.

మరిన్ని వార్తలు