కరోనా భయం: ఇక షేక్‌హ్యాండ్‌కు చెప్పండి బైబై!

7 Mar, 2020 16:20 IST|Sakshi

నో షేక్‌హ్యాండ్‌.. ఓన్లీ మోచేతి స్పర్శ

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అప్రమత్తతే సరైన విరుగుడు అని వైద్యులు, పలువురు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ముఖ్యంగా మనుషుల మధ్యే వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో మాస్కులు ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. కరచాలనం, ముద్దు పెట్టుకోవడం చేయొద్దంటున్నారు. ఈనేపథ్యంలో చాలామంది షేక్‌హ్యాండ్‌కు ప్రత్యామ్నాయంగా ఒకరికొకరు మోచేతులతో హలో చెప్పుకుంటున్నారు. తాజాగా అమెరికాలోని నెబ్రస్కా రాష్ట్ర గవర్నర్‌ పీట్‌ రికెట్స్‌ కూడా అదే చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ క్వారంటైన్‌ వద్ద ఆయన కరోనా బాధితుల కుటుంబ సభ్యులకు మోచేతులతో హలో చెప్పారు. ఈ వీడియో వైరల్‌​ అయింది.
(చదవండి: వ్యక్తిగత శుభ్రత పాటించండి: హీరో యశ్‌)

ఇదిలాఉండగా.. నాలుగు రోజుల క్రితం జర్మనీ ఛాన్సలర్‌ ఎంజెలా మెర్కెల్‌ ఎదురైన వింత అనుభవం కూడా కరోనా నేపథ్యంలో షేక్‌హ్యాండ్‌కు దూరంగా ఉండాలనే విషయాన్ని గుర్తు చేసింది. తన కార్యాలయానికి వచ్చిన ఛాన్సలర్‌ సహచర మంత్రి ఒకరితో చేయి కలపబోగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. దాంతో మెర్కెల్‌ ‘మీది మంచి నిర్ణయం’అని చెప్పి మెచ్చుకున్నారు. ఇక చైనాలోని వుహాన్‌ నగరంలో బయటపడిన కరోనా వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలపై పంజా విసురుతున్న విషయం తెలిసిందే. కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా గురువారం నాటికి 95,000 మంది ప్రజలకు వైరస్‌ సోకగా, 3,200 మంది మరణించారు. ఇప్పటి వరకు 80 దేశాలకు ఈ వైరస్‌ వ్యాపించింది. చైనాలో తగ్గుముఖం పట్టిన వైరస్‌ వ్యాప్తి, చైనాలో కన్నా ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. భారత్‌లోనూ కరోనా భయం రోజురోజుకీ పెరిగిపోతోంది.
(చదవండి: ప్రపంచం మొత్తం ‘నమస్తే’ పెడుతోంది : మోదీ)


(చదవండి: కరోనా‌: జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌ సందేశం విన్నారా?)

మరిన్ని వార్తలు