గూగుల్‌ ప్లే స్టోర్‌లో డేంజరస్‌ యాప్స్‌ హల్‌చల్‌

3 Oct, 2019 09:05 IST|Sakshi

హానికరమైన యాప్స్‌ను తొలగించేందుకు గూగుల్‌ అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ  డేంజరస్‌ యాప్స్‌ హల్‌ చల్‌ చేస్తూనే ఉన్నాయి. తాజా  పరిశోధన ప్రకారం గూగుల్‌ ప్లే స్టోర్‌లో  వీటి సంఖ్య  పెరుగుతూనే ఉంది. వీటి నిరోధానికి ఎంత కృషి చేస్తున్నప్పటికీ, మరిన్ని యాప్స్‌ రంగంలోకి దిగుతున్నాయని ఈఎస్‌ఈటీ భద్రతా పరిశోధకుడు లుకాస్ స్టెఫాంకో  విశ్లేషణలో బహిర్గతమైంది. 

ప్రమాదకరమైన ఈ గూగుల్ ఆండ్రాయిడ్ యాప్స్‌ ప్లే స్టోర్‌లో వేగంగా పెరుగుతున్నాయని లుకాస్ స్టెఫాంకో  నివేదించారు. ఈ యాప్స్‌లోని మాలావేర్‌ లక్షలాది వినియోగదారులను చేరిందని ఆయన తన పరిశోధనలో తేల్చారు.  ఈ క్రమంలో దాదాపు 172 హానికరమైన అనువర్తనాలను గుర్తించినట్టు  తెలిపారు. వీటిని 335 మిలియన్లకు పైగా  వినియోగదార్లు ఇప్పటికే  ఇన్‌స్టాల్‌ చేసుకున్నట్టు చెప్పారు. అటువంటి అనువర్తనాలు ప్లే స్టోర్‌లో అందుబాటులో లేకుండా  ప్లే స్టోర్  చర్యలు తీసుకుంటున్నా ఇవి  చెలరేగుతున్నాయని, ఈ నేపథ్యంలో వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అవసరమైన యాప్స్‌ను మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవడం, విశ్వసనీయ మూలాల నుండి మాత్రమే వీటిని స్వీకరించడంతోపాటు, వెబ్‌లో బ్రౌజ్ చేసేటప్పుడు ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని స్టెఫాంకో హెచ్చరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు