‘సరిహద్దు’కు శాంతియుత పరిష్కారం

8 Jul, 2017 01:30 IST|Sakshi

► బ్రిక్స్‌ సదస్సులో జిన్‌పింగ్‌
► మోదీతో చర్చలు ఆర్థిక, సామాజికంగా భారత్‌ ముందుకెళ్తోందని ప్రశంస  


హాంబర్గ్‌: బ్రిక్స్‌ దేశాల మధ్యనున్న ప్రాంతీ య అసమానతలు, వివాదాలను  రాజకీయ, శాంతియుత పద్ధతిలో పరిష్కారం చేసుకోవా లని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. భారత్‌–చైనా దేశాల మధ్య సిక్కిం సరిహద్దు ఘర్షణ, దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బ్రిక్స్‌ సదస్సులో జిన్‌పింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

బ్రిక్స్‌ సభ్యదేశాలు దృఢమైన బహుముఖ విధానాన్ని అవలంబించాలన్నారు. సహకారం, పరస్పర ప్రయోజనాల భద్రత, పరస్పర అనుసంధానతను పెంచుకునే విధంగా ముందుకెళ్లాలన్నారు. అటు జిన్‌పింగ్‌ కూడా భారత్‌ను ప్రశంసించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వ పోరాటాన్ని జిన్‌పింగ్‌ కొనియాడారు. ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో భారత్‌ ముందడుగేస్తోందని.. భవిష్యత్తులో మరింత విజయం సాధించాలని ఆయన అభిలషించారు. అంతకుముందు మోదీ మాట్లాడుతూ.. చైనా నాయకత్వంలో బ్రిక్స్‌ దూసుకెళ్తోందని ప్రధాని కొనియాడారు.

‘జిన్‌పింగ్‌ నేతృత్వంలో బ్రిక్స్‌ పురోగతి సానుకూలంగా ఉంది. భవిష్యత్తులో మన సహకారం మరింత బలోపేతం అవుతుంది. సెప్టెంబర్‌లో చైనాలోని జియామెన్‌లో జరగనున్న బ్రిక్స్‌ సదస్సుకు మా పూర్తి సహకారం ఉంటుంది’ అని మోదీ స్పష్టం చేశారు. అనంతరం, మోదీ–జిన్‌పింగ్‌ విస్తృత అంశాలపై చర్చలు జరిపారని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గోపాల్‌ బాగ్లే వెల్లడించారు. అయితే ఏయే అంశాలపై చర్చించారనే విషయాన్ని మాత్రం బాగ్లే చెప్పలేదు. మోదీ–జిన్‌పింగ్‌ సమావేశం ఉండబోదంటూ చైనా విదేశాంగ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని వార్తలు