క్యాన్సర్‌ను ముందే పసిగడుతున్న శునకాలు

17 May, 2019 09:57 IST|Sakshi

కాలిఫోర్నియా: ప్రపంచాన్ని భయపెడుతున్న వ్యాధుల్లో క్యాన్సర్‌ ఒకటి. ఈ వ్యాధి కారణంగా ఏటా లక్షలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఓ సర్వే ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 100 మందిలో దాదాపు 40 మంది ఏదో ఒక క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. క్యాన్సర్‌ సోకిన తొలి రోజుల్లోనే గుర్తిస్తే వ్యాధిని దాదాపు నయం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా కేసుల్లో వ్యాధిని ముందుగా గుర్తించలేకపోవడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయి. వ్యాధిని ముందుగానే గుర్తించడానికి చాలా మంది వైద్యులు పరిశోధనలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే అమెరికాలోని శాస్త్రవేత్తలు సరికొత్త విషయాన్ని కనుగొన్నారు. శునకాలకు ఉండే వాసనలను పసిగట్టే శక్తి వల్ల అవి క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తించగలవని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. 97 శాతం కేసుల్ని కుక్కలు అత్యంత కచ్చితంగా కనిపెడుతున్నట్లు పరిశోధనలో తేలింది. ఇందుకోసం బీగిల్‌ జాతికి చెందిన 4 కుక్కలకు శిక్షణ ఇచ్చారు. ట్రైనింగ్‌ తర్వాత కుక్కలు... లంగ్‌ క్యాన్సర్‌ ఉన్న వ్యక్తి రక్తాన్ని, క్యాన్సర్‌ లేని వ్యక్తికి చెందిన రక్తాన్ని వేర్వేరుగా గుర్తించగలిగాయి. 

మరిన్ని వార్తలు