తాలిబన్‌ నేతలతో ట్రంప్‌ రహస్య భేటీ రద్దు

9 Sep, 2019 03:53 IST|Sakshi
డొనాల్డ్‌ ట్రంప్‌

వాషింగ్టన్‌: తాలిబన్‌ నేతలతోపాటు అఫ్గానిస్తాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీతో జరగాల్సిన రహస్య భేటీని రద్దు చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అమెరికా సైనికుడి మృతికి కారణమైన కాబూల్‌ పేలుడుకు కారణం తామేనంటూ తాలిబన్‌ చేసిన ప్రకటనపై ఆయన ఈ మేరకు స్పందించారు. దీంతో అఫ్గానిస్తాన్‌లో శాంతి నెలకొల్పే లక్ష్యంతో అమెరికా– తాలిబన్‌ల మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న ప్రయత్నాలకు విఘాతం ఏర్పడినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. అఫ్గాన్‌ అధ్యక్షుడు ఘనీతోపాటు తాలిబన్‌ నేతలతో ఆదివారం డేవిట్‌ రిట్రీట్‌లోని తన క్యాంపు కార్యాలయంలో భేటీ కానున్నట్లు ట్రంప్‌ శనివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

అయితే, గురువారం కాబూల్‌లో అమెరికా సైనికుడితోపాటు 11 మంది చనిపోయిన కారు బాంబు పేలుడు తమ పనే అంటూ తాలిబన్‌ ప్రకటించడంతో ఆ భేటీని, శాంతి చర్చలను రద్దు చేసుకుంటున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ‘చర్చల్లో పైచేయి సాధించటం కోసం ఇలా చంపుకుంటూ పోతారా? ఎన్ని దశాబ్దాలు ఇలా పోరాటం సాగించాలనుకుంటున్నారు? ఇటువంటి చర్యలు పరిస్థితిని మరింత జఠిలంగా మారుస్తాయి. అర్థవంతమైన ఒప్పందం కుదరాలనే నైతిక అర్హత వారికి లేదు’ అని వ్యాఖ్యానించారు. తాలిబన్‌తో శాంతి చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని అమెరికా ప్రతినిధి ఖలీల్‌జాద్‌ ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

మరిన్ని వార్తలు