భారీ భూకంపం ; కూలిన భవంతులు.. జనం ఆర్తనాదాలు

8 Feb, 2018 03:11 IST|Sakshi
హువాలియెన్‌లో భూకంపం ధాటికి కులిపోయిన మార్షల్‌ హోటల్‌ భవనం (తాజా చిత్రం)

హువలీన్‌: తూర్పు ఆసియా దేశమైన తైవాన్‌ను శక్తిమంతమైన భూకంపం వణికించింది. హువలీన్‌ కౌంటీకి ఉత్తరాన దక్షిణ చైనా సముద్రంలో మంగళవారం అర్థరాత్రి 6.4 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 145 మంది గల్లంతయ్యారు.

ఈ ఘటనలో 31 మంది విదేశీయులు సహా 258 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రతకు దేశంలోని తూర్పు ప్రాంతంలో రోడ్లు, నీటి సరఫరా వ్యవస్థ ధ్వంసం కాగా, విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో దాదాపు 35,000 మంది ప్రజలు ఆహారం, నీళ్లు లేకుండా చీకట్లో మగ్గుతున్నారు. భూ ప్రకంపనలకు భారీ భవంతులు సైతం పేక మేడల్లా కూలిపోయాయి. మరికొన్ని నివాస, వాణిజ్య భవన సముదాయాలు కూడా భూమిలోకి కుంగిపోవడంతో అందులో చిక్కుకున్న  ప్రజలు బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వీరిని రక్షించడానికి 600 మంది సైనికులతో పాటు 750 మంది అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగినట్లు అత్యవసర సేవల కేంద్రం తెలిపింది.


 


భూకంపం తర్వాత హువాలియెన్‌లో కనిపించిన భీకర దృశ్యాలు..

మరిన్ని వార్తలు