3 నెలల్లో ‘హెచ్‌4’ను తేలుస్తాం

23 Sep, 2018 04:29 IST|Sakshi

వర్క్‌ పర్మిట్ల రద్దుపై మూడు నెలల్లో నిర్ణయంహెచ్‌4 వీసా కేసులో కోర్టుకు తెలిపిన ట్రంప్‌ సర్కారు

వాషింగ్టన్‌: హెచ్‌–4 వీసాదారులకు వర్క్‌ పర్మిట్లను రద్దు చేసే విషయమై వచ్చే మూడు నెలల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ట్రంప్‌ ప్రభుత్వం ఫెడరల్‌ కోర్టుకు తెలిపింది.‘హెచ్‌–1బీ వీసాదారుల భాగస్వాములకు ఉపాధి కల్పనకు అవకాశం కల్పించే హెచ్‌–4 వీసాకు సంబంధించిన నిబంధనను తొలగించాలని ప్రతిపాదించడంలో  మేము కచ్చితమైన పురోగతి సాధిస్తున్నాం’అని కొలంబియా జిల్లాలోని అమెరికా జిల్లా కోర్టుకు సమర్పించిన నివేదికలో హోంల్యాండ్‌ భ్రదత విభాగం(డిహెచ్‌ఎస్‌) పేర్కొంది. కొత్త నిబంధనను మూడు నెలల్లో అధ్యక్ష భవనంలోని ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ బడ్జెట్‌(ఓఎంబీ)కు సమర్పిస్తామని,అంత వరకు ఈ కేసులో నిర్ణయాన్ని ప్రకటించవద్దని కోర్టును కోరింది.

హెచ్‌1బీ వీసాపై అమెరికా వచ్చే విదేశీయుల భాగస్వాములకు అక్కడ ఉద్యోగ అవకాశం కల్పిస్తూ గతంలో ఒబామా ప్రభుత్వం హెచ్‌–4 వీసా నిబంధనను తీసుకొచ్చింది. ఈ నిబంధన కింద యుఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యుఎస్‌సిఐఎస్‌)హెచ్‌–1బీ వీసాదారుల కుటుంబ సభ్యులకు(భాగస్వామి,21 ఏళ్లలోపు పిల్లలకు)హెచ్‌–4 వీసాలు మంజూరు చేస్తోంది.దీనివల్ల లక్షల మంది భారతీయ మహిళలు లబ్ది పొందుతున్నారు.ఒబామా హయాంలో ఇచ్చిన ఈ అవకాశం దుర్వినియోగమవుతోందని, ఈ నిబంధన సాకుతో కంపెనీలు అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని భావిస్తున్న ట్రంప్‌ ప్రభుత్వం ఒబామా ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఒమాబా హయాంలో అమల్లోకి వచ్చిన ఈ విధానం వల్ల తమ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతోందంటూ కొందరు అమెరికన్లు(ఉద్యోగులు) కోర్టులో కేసు వేశారు.ఆ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం గత  ఈ అఫిడవిట్‌ దాఖలు చేసింది. హెచ్‌4వీసాదారుల వర్క్‌ పర్మిట్లను రద్దు చేయనున్నట్టు ట్రంప్‌ ప్రభుత్వం బహిరంగంగాను, కోర్టులోనూ కూడా చెబుతూ వస్తోంది.  హెచ్‌4 వీసా వర్క్‌ పర్మిట్‌ రద్దుకు త్వరలో నిర్ణయం తీసుకుంటామంటూ ప్రభుత్వం ఇప్పటికే మూడు సార్లు కోర్టుకు తెలిపింది. నిర్ణయం ఆలస్యం అవుతోందంటూ గత ఫిబ్రవరి 28, మే 22, ఆగస్టు 20లలో కోర్టుకు తెలిపింది. తరువాయి స్టేటస్‌ రిపోర్టును(స్థాయి నివేదిక) వచ్చే నవంబర్‌ 19న కోర్టుకు సమర్పించనుంది.

సాధారణ ప్రక్రియే
హెచ్‌4 వీసా వర్క్‌ పర్మిట్ల రద్దుపై నిర్ణయంలో జాప్యం జరగడం సాధారణమేనని అమెరికా అటార్నీ జనరల్‌ కోర్టుకు తెలిపారు.‘డిహెచ్‌ఎస్‌కు చెందిన సీనియర్‌ నాయకులు ప్రతిపాదనను సమీక్షించడం, సవరణలు సూచించడం సాధారణంగా జరిగేదే.అవసరమైన సవరణలు పొందుపరిచిన తర్వాత తుది ఆమోదం కోనం యుఎస్‌సిఐఎస్‌ ఆ ప్రతిపాదనను డిహెచ్‌ఎస్‌కు పంపుతుంది. తర్వాత ఓఎంబీకి సమర్పించడం జరుగుతుంది’అని అటార్నీ తాజా అఫిడవిట్‌లో కోర్టుకు వివరించారు.అయితే, కోర్టు తీర్పు ఆలస్యం అవుతున్న కొద్దీ తమకు మరింత ఎక్కువ హాని జరుగుతుందని పిటిషనర్లు(సేవ్‌ జాబ్స్‌ యుఎస్‌ఏ) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా తీర్పు ఇవ్వాలని కోర్టును కోరుతున్నారు.


1.26 లక్షల మందికి ఆనుమతి
2015, మే నుంచి ఒబామా విధానం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి 2017 డిసెంబర్‌ 25 వరకు యుఎస్‌సిఐఎస్‌ 1,26,853 మందికి వర్క్‌ పర్మిట్లు మంజూరు చేసింది. వీటిలో 90,846 దరఖాస్తులు కొత్తగా అనుమతి కోరుతూ పెట్టుకున్నవి కాగా,35,219 రెన్యువల్‌ దరఖాస్తులు.వర్క్‌ పర్మిట్‌ కార్డులు పోవడంతో కొత్త కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తులు 688.‘ యుఎస్‌సిఐఎస్‌ మంజూరు చేసిన దరఖాస్తుల్లో 93శాతం భారతదేశంలో పుట్టి ఇక్కడికి వచ్చిన వారివే.5శాతం చైనాలో పుట్టిన వారివి. మిగతా రెండు శాతం ఇతర దేశాల్లో పుట్టిన వారివి.’అని కాంగ్రెçసనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ ఒక నివేదికలో తెలిపింది.యుఎస్‌సిఐఎస్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు.
 

మరిన్ని వార్తలు