సముద్రంలో పడవ బోల్తా.. 26 మంది మృతి

4 Jul, 2019 11:22 IST|Sakshi

హోండురస్ : సముద్రంలో పీతల వేటకు వెళ్లిన జాలర్ల పడవ బోల్తా పడిన ఘటనలో 26 మృతి చెందారు. ఈ ఘటన కరీబియన్ తీరంలోని హోండురస్‌ దేశంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి 47 మంది సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. సముద్ర పీతల వేటపై అక్కడి ప్రభుత్వం సీజనల్‌ బ్యాన్‌ ఎత్తివేయడంతో జాలర్లు వేటకు బయలుదేరారు. 70 టన్నుల బరువుగల పెద్ద పడవలో వారు పీతల వేటకు తీరజలాల్లో ప్రవేశించారు. అయితే ప్రమాదవశాత్తు వారు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. పడవ కెప్టెన్‌ ప్రమాదపు సిగ్నల్‌ పంపినప్పటికీ.. కొద్ది సేపటికే అతను చనిపోయాడు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. దీంతో ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది.

ఈ ఘటనపై భద్రతా దళాల అధికార ప్రతినిధి జోస్ మెజా మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను అక్కడికి దగ్గర్లోని ప్యూర్టో లెంపిరా ప్రాంతానికి చేర్చామని తెలిపారు. ప్రాణాలతో బయటపడ్డవారిని అక్కడికే తరలించినట్టు పేర్కొన్నారు. ఈ ప్రమాదం జరిగేందుకు ముందే అదే ప్రదేశంలో మరో బోటు మునిగిపోయిందని తెలిపారు. అయితే ఆ ఘటనలో ఎవరు చనిపోలేదని.. పడవలోని 40 సురక్షితంగా తీరానికి చేర్చామని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు