Israel-Hamas war: 24 మంది బందీలకు స్వేచ్ఛ

25 Nov, 2023 05:36 IST|Sakshi
హమాస్‌ విడుదల చేసిన బందీలతో గాజా నుంచి బయల్దేరిన వాహనం; టెల్‌ అవీవ్‌లో బంధువుల ఆనందోత్సాహాలు

అమల్లోకి వచి్చన ఇజ్రాయెల్‌–హమాస్‌ ఒప్పందం

13 మంది ఇజ్రాయెలీలు, 10 మంది థాయ్‌లాండ్‌ పౌరులు, ఒక ఫిలిప్పైన్స్‌ జాతీయుడికి విముక్తి

విడుదలైన బందీలను ఈజిప్టుకు తరలించిన రెడ్‌క్రాడ్‌ సంస్థ

గాజాలో కాల్పుల విరమణ ప్రారంభం.. ఆగిన ఇజ్రాయెల్‌ దాడులు

మొదటి దశలో 39 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టిన ఇజ్రాయెల్‌!

ఈజిప్టు నుంచి గాజాకు మానవతా సాయం, ఇంధనం చేరవేత

గాజా స్ట్రిప్‌/జెరూసలేం: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గాజా స్ట్రిప్‌లో శుక్రవారం భూతల, వైమానిక దాడులు ఆగిపోయాయి. ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పేరుగాంచిన గాజాలో ఏడు వారాల తర్వాత ప్రశాంత వాతావరణం కనిపించింది. పాలస్తీనియన్ల ఎదురు చూపులు ఫలిస్తున్నాయి. విదేశాల నుంచి పెద్ద ఎత్తున మానవతా సాయం, ఇంధనం గాజాకు చేరుకుంటోంది.

అమెరికా, ఈజిప్టు, ఖతార్‌ దేశాల చొరవతో ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య కుదిరిన సంధి శుక్రవారం ఉదయం నుంచే అమల్లోకి వచి్చంది. తాత్కాలిక కాల్పుల విరమణ నాలుగు రోజులపాటు కొనసాగనుంది. ఒప్పందం మేరకు హమాస్‌ చెరలోని బందీల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటిరోజు 13 మంది ఇజ్రాయెలీ బందీలకు హమాస్‌ మిలిటెంట్లు స్వేచ్ఛావాయువులు ప్రసాదించారు. వీరిలో ఆరుగురు వృద్ధులు, నలుగురు పిల్లలున్నారు.

వారిని రెడ్‌క్రాస్‌ సంస్థకు అప్పగించారు. మొత్తం 24 మంది బందీలను హమాస్‌ విడిచిపెట్టిందని, వారిని 4 వాహనాల్లో ఈజిప్టుకు చేర్చామని రెడ్‌క్రాస్‌ వెల్లడించింది. వీరిలో 13 మంది ఇజ్రాయెల్‌ పౌరులు, 10 మంది థాయ్‌లాండ్‌ పౌరులు, ఒకరు ఫిలిప్పైన్స్‌ పౌరుడున్నట్టు ఖతార్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు. విడుదలైన బందీలంతా ఆరోగ్యంగానే కనిపిస్తున్నారని ఇజ్రాయెల్‌ వైద్య శాఖ తెలియజేసింది.

హమాస్‌ డిమాండ్‌ను నెరవేరుస్తూ ఇజ్రాయెల్‌ కూడా మొదటి దశలో 39 పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిందని సమాచారం. వీరిలో 24 మంది మహిళలు కాగా 15 మంది చిన్నారులు. వారిని తీసుకుని వాహనాలు వెస్ట్‌ బ్యాంక్‌లోని జైళ్ల నుంచి రమల్లాకు బయల్దేరాయి. నాలుగు రోజుల వ్యవధిలో 50 మంది బందీలకు హమాస్‌ విముక్తి కల్పించాల్సి ఉంది. అలాగే 150 మంది ఖైదీలను జైళ్ల నుంచి ఇజ్రాయెల్‌ విడిచిపెట్టాలి. ప్రస్తుతం 7,200 మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌ జైళ్లలో మగ్గుతున్నారు.  

‘ఉత్తరాది వలస’లపై కాల్పులు..
ఇజ్రాయెల్‌ వైమానిక, భూతల దాడులు ఆగిపోవడంతో దక్షిణ గాజా నుంచి జనం ఉత్తర గాజాకు కాలినడకన తిరిగివస్తున్నారు. వారిని ఎక్కడికక్కడ అడ్డుకొనేందుకు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రయతి్నస్తోంది. శుక్రవారం పలుచోట్ల వారిపై కాల్పులు జరిపింది. ఎవరూ వెనక్కి వెళ్లొద్దంటూ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించారని, 11 మంది గాయపడ్డారని స్థానిక మీడియా తెలియజేసింది. అక్టోబర్‌ 7న గాజాపై దాడులు మొదలైన తర్వాత ఇజ్రాయెల్‌ హెచ్చరికల వల్ల ఉత్తర గాజా నుంచి లక్షలాది మంది ప్రాణభయంతో దక్షిణ గాజాకు వలసవెళ్లారు. వారంతా స్వస్థలాలకు తిరిగి రావాలని భావిస్తున్నారు.   

గాజాకు 1.30 లక్షల లీటర్ల డీజిల్‌  
కాల్పుల విరమణ, బందీల విడుదల ప్రక్రియ ప్రారంభం కావడంతో గాజాకు మానవతా సాయం చేరవేతలోనూ వేగం పెరిగింది. ఆహారం, నిత్యావసరాలు, ఔషధాలు, వైద్య పరికరాలు, దుస్తులు తదితర సామగ్రితో దాదాపు 90 వాహనాలు శుక్రవారం ఈజిప్టు నుంచి రఫా క్రాసింగ్‌ గుండా గాజాలోకి ప్రవేశించాయి. అలాగే 1.30 లక్షల లీటర్ల డీజిల్‌ కూడా గాజాకు అందింది. డీజిల్‌ లేక, జనరేటర్లు పనిచేయక గాజా ఆసుపత్రుల్లో వైద్య సేవలు ఇప్పటికే నిలిచిపోయాయి. కాల్పుల విరమణ అమల్లో ఉన్న నాలుగు రోజుల్లో రోజుకు 1.30 లక్షల లీటర్ల డీజిల్‌ను గాజాకు సరఫరా చేయడానికి ఇజ్రాయెల్‌ అనుమతి ఇచి్చంది. వాస్తవానికి గాజాకు నిత్యం 10 లక్షల లీటర్ల డీజిల్‌ అవసరం.

కాల్పుల విరమణ పొడగిస్తారా ?
ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కేవలం నాలుగు రోజులపాటే అమల్లో ఉంటుంది. ఆ తర్వాత కూడా ఒప్పందాన్ని పొడిగిస్తారని సమాచారం. హమాస్‌ చెరలో 240 మంది బందీలు ఉన్నారు. వారందరినీ విడుదల చేయించాలంటే నాలుగు రోజుల సమయం సరిపోదు. అందుకే ఒప్పందం పొడిగింపునకు ఇజ్రాయెల్‌ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు