పడవిమానం!

29 Aug, 2016 01:58 IST|Sakshi
పడవిమానం!

చూడ్డానికి ఇది విమానంలా కనిపిస్తుంది కానీ విమానం కాదు.
పడవలా అనిపిస్తుంది కానీ పడవ కాదు. నీటిని తాకకుండా నీటిపైన,
నింగిలోకి ఎగరకుండా గాలిపైన ప్రయాణించే ఈ వాహనం... ‘ఫ్లై షిప్’!

 
గాల్లో ఎగిరేదాన్ని విమానం అంటాం. నీటిపై వెళ్లేదాన్ని పడవ అంటాం. మరి... నీటిపైనే గాల్లో తేలియాడుతూ ముందుకు దూసుకెళ్లేదాన్ని ఏమంటాం? ఎగిరే పడవలు! ఇంగ్లీషులో చెప్పాలంటే ఫ్లైషిప్స్ అనాలి అంటోంది జర్మనీ ఇంజినీరింగ్ సంస్థ ‘ది ఫ్లైషిప్’. సముద్రంపై ఎగిరే పక్షుల్ని మీరు ఎప్పుడైనా చూశారా? రెక్కల్ని విశాలంగా చాపుకుని అవి అలా అలా ఎగురుతూ పోతాయి. అలా అతి తక్కువ శ్రమతో ఎక్కువ దూరం వెళ్లవచ్చు. ఫ్లైషిప్ కూడా ఇంతే.

రెండు టర్బో ఇంజిన్ల ద్వారా నీటి ఉపరితలంపై గాలిపొరను ఏర్పాటు చేసుకుని దానిపై ఎగురుతూ ఉంటుందన్నమాట. అందుకే ఇదే సైజున్న విమానం గంటకు 3300 లీటర్ల ఇంధనం ఖర్చు పెడితే ఫ్లైషిప్ 270 లీటర్లతో సరిపెట్టుకుంటుంది. పైగా గంటకు 250 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు కూడా. సముద్రాల ద్వారా సరుకులు రవాణా చేసే కంటెయినర్ షిప్స్ నత్తతో పోటీ పడుతున్నట్లుగా గంటకు 46 కిలోమీటర్ల వేగంతోనే వెళతాయన్నది ఇక్కడ చెప్పుకోవాలి. దాదాపు 121 అడుగుల పొడవు ఉండే ఫ్లైషిప్ రెక్కల పొడవు దాదాపు 131 అడుగులు. ఒక్కో ఫ్లైషిప్‌లో దాదాపు వంద మంది ప్రయాణించవచ్చు. టేకాఫ్, ల్యాండింగ్‌లకు ప్రత్యేకించి  రన్‌వే లాంటివి అవసరం లేకపోవడం (టేకాఫ్ అయినా, ల్యాండింగ్ అయినా నీళ్ల మీదే!), ‘బోయింగ్ ఏ 318’ విమానం ధరలో సగానికి అందుబాటులో ఉండటం ఫ్లైషిప్ ప్రత్యేకతలు. తీరప్రాంత గస్తీకోసమైనా, సరుకు, ప్రజా రవాణాకైనా, సముద్ర దొంగల పనిపట్టాలన్నా ఫ్లైషిప్స్ వినియోగం మేలని అంచనా.

>
మరిన్ని వార్తలు