ఇరాన్‌- అమెరికా ఉద్రిక్తత: జర్మనీ కీలక నిర్ణయం

7 Jan, 2020 16:10 IST|Sakshi

బెర్లిన్‌/టెహ్రాన్‌: ఇరాన్‌ జనరల్‌ ఖాసీం సులేమానీని అమెరికా మట్టుబెట్టిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్‌ మద్దతున్న హిజ్బుల్‌ బ్రిగేడ్‌ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు.. గత మంగళవారం ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై చేసిన విషయం విదితమే.  ఇందుకు ప్రతీకార చర్యగా  ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో శుక్రవారం రాకెట్‌ దాడికి పాల్పడి.. అగ్రరాజ్యం సులేమానిని హతమార్చింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌- ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటున్నారు. అంతేగాకుండా ఇరాక్‌ పార్లమెంట్‌ సైతం అమెరికా తమ దేశం నుంచి వెంటనే వెళ్లిపోవాలంటూ తీర్మానం చేసింది. అదే విధంగా... సులేమానీని హతమార్చిన అమెరికా సైన్యాన్ని ఉగ్రవాదులుగా పేర్కొంటూ ఇరాన్‌ పార్లమెంట్‌ మంగళవారం తీర్మానించింది. దీంతో మధ్య ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.(52తో పాటు.. 290 కూడా గుర్తుపెట్టుకో ట్రంప్‌!)

ఈ నేపథ్యంలో జర్మనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాక్‌లో మోహరించిన తమ బలగాలు కొన్నింటిని వెనక్కి పిలిపించినట్లు పేర్కొంది. బాగ్దాద్‌, తాజీలో ఉన్న సదరు బలగాల(30 మంది సైనికులు)ను జోర్డాన్‌, కువైట్‌కు తరలించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు జర్మనీ విదేశాంగ మంత్రి హైకో మాస్‌ మట్లాడుతూ.. ‘ఇరాక్‌ ప్రభుత్వం, పార్లమెంట్‌ నుంచి మాకు ఆహ్వానం అందినపుడు బలగాలు మోహరించాం. అయితే ప్రస్తుతం విదేశీ బలగాలు తమ దేశం విడిచి వెళ్లాలని ఆ దేశ పార్లమెంట్‌ తీర్మానించింది. కాబట్టి చట్టప్రకారం మేం అక్కడ ఉండకూడదు. ఇందుకు సంబంధించి త్వరలోనే బాగ్దాద్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. కాగా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ను ఎదుర్కొనే క్రమంలో ఇరాక్‌కు మద్దతుగా.. జర్మనీ దాదాపు 415 మంది సైనికులను అక్కడ మోహరించిన విషయం తెలిసిందే. (ఇరాన్‌కు అమెరికా షాక్‌!)

ఇక పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరలు, అమెరికా, ఇరాన్‌లు చేస్తున్న తీవ్ర ప్రకటనల నేపథ్యంలో జర్మనీ చాన్సెలర్‌ మెర్కెల్, ఫ్రాన్సు అధ్యక్షుడు మేక్రాన్, బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌ ఒక ఉమ్మడి ప్రకటన చేశారు. ‘ ఇటువంటి సందర్భాల్లో ఐఎస్‌కు వ్యతిరేకంగా జట్టుగా కలిసి  ఉండటం చాలా ముఖ్యం’ అని పేర్కొన్నారు. అదే విధంగా ఐఎస్‌ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధాన్ని ప్రమాదంలో పడవేయవద్దని విఙ్ఞప్తి చేశారు.  ఉద్రిక్తతలను తగ్గించేందుకు అన్ని పక్షాల వారు బాధ్యతగా వ్యవహరించాలని  పేర్కొన్నారు.  

సంబంధిత కథనాలు

 ట్రంప్‌ తలపై రూ.575 కోట్లు

మా ప్రతీకారం భీకరం

నిశ్శబ్దంగా చంపేశారు

అమాయకులను చంపినందుకే..

మరిన్ని వార్తలు