గొరిల్లా గ్లాస్-5 వచ్చేసింది!

21 Jul, 2016 16:06 IST|Sakshi
గొరిల్లా గ్లాస్-5 వచ్చేసింది!

న్యూయార్క్ః మార్కెట్లో లభ్యమవుతున్న వివిధ మోడళ్ళ స్మార్ట్ ఫోన్ లు అధునాతన  గొరిల్లా గ్లాస్ స్క్రీన్ లను కలిగి ఉంటున్నాయి. ఇలా గొరిల్లా గ్లాస్ ఉన్న ఫోన్లు ఎత్తునుంచీ కింద పడినా  స్ర్నీన్ దెబ్బతినదన్న విషయం చాలామందికి ఇప్పటికే తెలిసిన విషయం. ఈ గ్లాస్ గీతలు పడకుండా కూడా నిరోధిస్తుంది.  అయితే ఇప్పుడు గొరిల్లా గ్లాస్ 5 మరింత మన్నికతో, ధృఢంగా మార్కెట్లోకి ప్రవేశించింది.  

గ్లాస్ మేకర్ కార్నింగ్.. కొత్త గొరిల్లా గ్లాస్ 5 ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు, ఎలక్ట్రానిక్స్ తయారీదారులు తమ పరికరాల్లో ఉపయోగించే ఈ సూపర్ గ్లాస్ ను ఇప్పుడు రసాయనికంగా మరింత ధృఢంగా, బలంగా ఉండేట్టు రూపొందించారు. ఈ కొత్త గ్లాస్.. 1.6 మీటర్ల ఎత్తునుంచీ కిందపడినా 80 శాతం వరకూ పగిలే అవకాశమే ఉండదని ఉత్పత్తిదారులు చెప్తున్నారు. ముఖ్యంగా గాడ్జెట్ల పనితీరును మెరుగు పరిచేందుకు వీలుగా ఈ కొత్త గొరిల్లా గ్లాస్ 5 ను రూపొందించారు. భుజం లేదా నడుము ఎత్తునుంచీ గట్టిగా ఉండే ఉపరితలంపై పడినా స్మార్ట్ ఫోన్లు, గాడ్జెట్లకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా, గ్లాస్ పగలకుండా ఉండేట్టు తయారు చేసినట్లు పేర్కొన్నారు. 2014 లో కార్నింగ్... గొరిల్లా గ్లాస్ 4 ను ప్రవేశ పెట్టింది. అప్పట్లో ఆ గ్లాస్ ను 1 మీటర్ ఎత్తునుంచి పడినా పగలకుండా, దెబ్బతినకుండా ఉండేట్లు రూపొందించింది. ఇప్పుడు ఈ కొత్త గొరిల్లా గ్లాస్ 5 ను మునుపటికంటే రెండు రెట్లు దృఢంగా రూపొందించినట్లు కార్నింగ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్  జాన్ బేన్ తెలిపారు.

గొరిల్లా గ్లాస్ ను మొట్టమొదట 2007 లో ఎలెక్ట్రానిక్ పరికరాల్లో వినియోగించడం ప్రారంభించారు. అప్పట్నుంచీ మరింత మన్నిక పెరిగేలా, గీతల్ని నిరోధించేలా, మరింత పలుచగా తయారు చేసేందుకు కార్నింగ్ సంస్థ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటివరకూ సుమారు 4.5 బిలియన్ల పరికరాల యూనిట్లకు గొరిల్లా గ్లాస్ రవాణా జరిగినట్లు కంపెనీ చెప్తోంది. శాంసంగ్, హెచ్టీసీ, హెవావే, ఎల్జీ, హెచ్పీ, ఆసుస్ వంటి పేరు పొందిన తయారీదారులతోపాటు.. మరెందరో పేరులేని పరికరాల ఉత్పత్తిదారులు కూడా కార్నింగ్ గ్లాస్ ను ఉపయోగించి పరికరాలు చేస్తున్నట్లు జాన్ తెలిపారు.

మరిన్ని వార్తలు