జపాన్‌ కన్నా వెనకబడిన అమెరికా...

2 Nov, 2016 15:01 IST|Sakshi
అమెరికాలో తగ్గుతున్న మహిళా ఉద్యోగులు

ఫ్రాన్స్‌: ఆర్థిక సహకారం, అభివృద్ధి సంఘం (ఓఈసీడీ) సభ్య దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న మహిళల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ఆశ్చర్యంగా అమెరికాలో తగ్గిపోతోంది. 20 ఏళ్ల క్రితం, అంటే 1995లో మహిళలు ఉద్యోగాలు చేయడంలో అమెరికా జపాన్‌కన్నా ముందు ఉండగా ఇప్పుడు జపాన్‌ కన్నా వెనకబడి పోయింది. అమెరికా, డెన్మార్క్‌ మినహా ఓఈసీడీలోని 35 సభ్య దేశాల్లో  ప్రధానంగా 2,000 సంవత్సరం నుంచే ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. 2000 నుంచి 2015 నాటికి మహిళల ఉద్యోగాల ఇండెక్స్‌లో అమెరికా ఆరు శాతం పాయింట్లు నష్టపోయి నేడు 63 శాతానికి చేరుకుంది. అదే జపాన్‌ 14 శాతం పాయింట్లు పుంజుకొని 65 శాతం పాయింట్లకు చేరుకొంది.

ప్రస్తుతం అమెరికా కన్నా జపాన్‌లోనే మహిళలు ఎక్కువగా ఉద్యోగాలు చేస్తున్నారు. అమెరికాతోపాటు డెన్మార్క్‌లో కూడా ఉద్యోగాలు చేస్తున్న మహిళల సంఖ్య తగ్గిపోయినప్పటికీ 70 శాతం పాయింట్లతో ఇప్పటికీ ప్రపంచంలోకెల్లా డెన్మార్క్‌లోనే ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. డెన్మార్క్‌ తర్వాత స్థానాల్లో జర్మనీ, కెనడా, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్‌ దేశాలు ఉన్నాయి. ఈ విషయంలో ఫ్రాన్స్‌ వేగంగా పురోగమిస్తున్నప్పటికీ ఇప్పటికీ అది అమెరికాకన్నా వెనుకబడే ఉన్నది. 61శాతం పాయింట్లతో, అంటే రెండు శాతం పాయింట్లతో వెనకబడిన ఫ్రాన్స్, అమెరికాను అధిగమించడానికి ఎంతో కాలం పట్టదని ఓఈసీడీ విడుదల చేసిన ఓ నివేదిక వెల్లడిస్తోంది.

ఓఈసీడీలోని పలు దేశాల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య నానాటికి పెరగడానికి కారణం ఆయా దేశాల్లో మహిళలను ప్రోత్సహించేందుకు ఇస్తున్న సౌకర్యాలు, రాయితీలే ప్రధాన కారణం. మాతృత్వంతోపాటు పితృత్వం సెలవులు ఇస్తుండడమే కాకుండా కొన్ని దేశాల్లో కొత్త దంపతులకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నారు. చైల్డ్‌ కేర్‌ సెంటర్లకు సబ్సిడీలు కూడా ఇస్తున్నారు. అమెరికాలో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య క్రమంగా తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చైల్డ్‌కేర్‌ సెంటర్లు అక్కడ బాగా ఖరీదవడం ప్రధాన కారణం కాగా, ఉద్యోగులకు వేతనాలతో కూడా పేరెంట్స్‌ సెలవులు ఇవ్వకపోవడం, ద్రవ్యోల్బణం పెరగడం ఇతర కారణాలు.

జపాన్‌లో తల్లిదండ్రులిద్దరూ  58 వారాలపాటు వేతనాలతో కూడిన సెలవులు తీసుకోవచ్చు. జర్మనీలో బాలింతలు 58 వారాలు, జర్మనీలో 58 వారాలు, కెనడాలో 52, డెన్మార్క్‌లో 50, ఫ్రాన్స్‌లో 42, బ్రిటన్‌లో 39 వారాలపాటు వేతనాలతో కూడిన సెలవులు తీసుకోవచ్చు. ఇక తండ్రులు ఫ్రాన్స్‌లో 28 వారాలు, జర్మనీలో తొమ్మిది, బ్రిటన్, డెన్మార్క్‌లో రెండు వారాలపాటు సెలవులు తీసుకోవచ్చు. అమెరికాలో చైల్డ్‌కేర్‌ సెంటర్లకు ఓ కుటుంబానికి వచ్చే ఆదాయంలో మూడోవంతు భాగాన్ని చెల్లించాల్సి వస్తోంది. తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలు వీటి ఖర్చును భరించలేక పోతున్నాయి. అందుకని ఎక్కువ మంది మహిళల ఇంటిపట్టున ఉండి పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకునేందుకు ఇష్టపడుతున్నారు.

 

మరిన్ని వార్తలు