ఏ విధంగా  సాయపడగలను!

13 Jan, 2019 01:52 IST|Sakshi
జపాన్‌ రోబో

అది జపాన్‌లోని టోక్యోలో ఉన్నఓ సబ్‌వే రైల్వే స్టేషన్‌.. మీరు ఆ స్టేషన్‌కు వెళ్లారనుకోండి.. మీకేమో జపనీస్‌ భాష తెలియదు. అక్కడున్న వారు చెబుతారో లేదో అయోమయం..! మరెలా..? ఏమీ లేదు ఆ స్టేషన్‌లో అక్కడక్కడా ప్రయాణికులకు సాయం చేసేందుకు ‘కొందరు’నిల్చుని ఉంటారు. ఎక్కడికి వెళ్లాలన్నా.. ఏ రైలు ఎక్కాలన్నా.. వారు చిటికెలో సమాధానం చెప్పి మీకు ఊరట కల్పిస్తారు. ఇంతకీ వారెవరు ఆ రైల్వే స్టేషన్‌ ఏర్పాటు చేసుకున్న సిబ్బందేమో అనుకుంటున్నారా.. మీరు అనుకున్నది కొంత వరకు నిజమే కానీ వారు మనుషులు కాదు. రోబోలు!

అవును మీకు సాయపడేందుకు రోబోలను టోక్యో ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచింది. ఎందుకంటారా..? ఎందుకంటే జపాన్‌లో 2020లో ఒలింపిక్స్‌ గేమ్స్‌ జరగనున్నాయి కదా.. అక్కడికి దేశవిదేశాల నుంచి వచ్చే ఆటగాళ్లు, పర్యాటకుల కోసం వీటిని ఏర్పాటు చేసింది. ‘ఆరిసా’అనే ఈ ప్రాజెక్టును టోక్యో మెట్రో పాలిటన్‌ ప్రభుత్వం చేపట్టింది. రైలుకు సంబంధించి.. ఏ సాయం కోరినా కూడా ఎంతో మర్యాదగా, ఓపికగా సమాధానం చెప్పి మీ ప్రయాణం సాఫీగా సాగిపోయేలా చేస్తాయి ఈ రోబోలు. మీరు సెల్ఫీ అడిగినా కూడా సిగ్గు పడకుండా మీతో ఫొటోలు దిగుతాయి కూడా..!   

మరిన్ని వార్తలు