శాంతికి సిద్ధం.. కశ్మీర్‌ కీలకం!

27 Jul, 2018 03:31 IST|Sakshi
ఇస్లామాబాద్‌లో ప్రసంగిస్తున్న ఇమ్రాన్‌ ఖాన్‌. ఇస్లామాబాద్‌లో సంబరాలు చేస్తున్న పీటీఐ కార్యకర్తలు, అభిమానులు

లోయలో మానవ హక్కుల ఉల్లంఘన

దీనిపై చర్చలే సరైన ప్రత్యామ్నాయం

భారత్‌ ఒకడుగు వేస్తే.. మేం రెండడుగులేస్తాం

మీడియాతో ఇమ్రాన్‌ ఖాన్‌  

ఇస్లామాబాద్‌: భారత్‌తో సత్సంబంధాలు నెలకొల్పేందుకు తన నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వం సిద్ధంగా ఉందని పాకిస్తాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ) చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ స్పష్టం చేశారు. కీలమైన కశ్మీర్‌ వివాదం సహా అన్ని అంశాలపై ఇరుదేశాల నేతలు పరిష్కారం కుదుర్చుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం జరిగిన పాకిస్తాన్‌ ఎన్నికల్లో పీటీఐ అతిపెద్ద పార్టీగా నిలిచిన నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. భారత్‌–పాక్‌లు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకోవడానికి ముగింపు పలికి ఉపఖండంలో సుస్థిరతకు ప్రయత్నం చేయాలన్నారు. 2016లో పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు ముంబైలో దాడులకు పాల్పడిన తర్వాత ఇరుదేశాల మధ్య ఇంతవరకు ద్వైపాక్షిక చర్చలు జరగలేదు. అనంతరం కుల్‌భూషణ్‌ జాధవ్‌ అనే మాజీ నేవీ అధికారిని భారత నిఘా అధికారి అని ఆరోపిస్తూ.. ఆయనకు పాక్‌ కోర్టు మరణశిక్ష విధించడంతో పరిస్థితులు జఠిలంగా మారాయి.

కశ్మీర్‌ అంశంపై..
‘ఇరుదేశాల మధ్య సత్సంబంధాల కోసం భారత్‌ ఒక అడుగు ముందుకేస్తే మేం రెండడుగులు వేస్తాం. కానీ ఎవరో ఒకరు ఈ దిశగా చొరవతీసుకోవాలి’ అని ఇమ్రాన్‌ అన్నారు. రెండు దేశాల మధ్య కశ్మీర్‌ ఒక్కటే కీలకమైన అంశం. చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కోసం ఇరుదేశాలు సిద్ధం కావాలి. 30 ఏళ్లుగా భారత ఆర్మీ ద్వారా కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ఈ సమస్యకు ముగింపు పలకాలి. ఇరుదేశాల ప్రభుత్వాలు చర్చలు జరపాలి. ఈ సమస్యపై  అటూ ఇటూ తిరిగి మళ్లీ మొదటకే వస్తున్నాం’ అని ఇమ్రాన్‌ వ్యాఖ్యానించారు.

వాణిజ్య సంబంధాలపై
‘ఒకవేళ భారత నాయకత్వం కోరుకుంటే.. ఆ దేశంతో సంబంధాలు బలోపేతం కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. బెలూచిస్తాన్‌లో జరుగుతున్న దానికి భారత్‌దే బాధ్యతని.. అలాగే కశ్మీర్‌లో జరుగుతున్న ఘటనలకు పాకిస్తాన్‌ బాధ్యతంటూ ఒకరినొకరు తప్పుబట్టుకోవడం సరికాదు. ఇలాంటి ఆరోపణలతో మనం వృద్ధి చెందలేం. ఇవి ఉపఖండానికి చేటుచేస్తాయి. భారత్‌–పాకిస్తాన్‌ సత్సంబంధాలు, సరైన వాణిజ్య బంధాల ద్వారా ఈ ప్రాంతానికి చాలా మేలు జరుగుతుంది. రెండు దేశాలు ఆర్థికంగా సమృద్ధి చెందుతాయి’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ అభిప్రాయ పడ్డారు.

భారత మీడియాపై..
తనపై భారత మీడియా పేర్కొంటున్న కథనాలపై ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కొంతకాలంగా భారత మీడియా నన్ను బాలీవుడ్‌ సినిమాల్లో విలన్‌ మాదిరిగా చిత్రీకరిస్తోంది. ఆ వార్తలను చూస్తుంటే చాలా బాధేస్తోంది. భారత్‌తో సత్సంబంధాలు కోరుకునే ఓ పాకిస్తానీని నేను. ఇమ్రాన్‌ ఖాన్‌ అధికారంలోకి వస్తే భారత్‌కు చెడు జరుగుతుందనే ప్రచారం చేస్తున్నారు. ఇది సరికాదు. ఓ క్రికెటర్‌గా భారత్‌ అంతా చుట్టేశాను. భారత్, భారత ప్రజల గురించి నాకు బాగా తెలుసు. మనం కలిస్తే ఆగ్నేయాసియాలో పేదరికాన్ని పారద్రోలవచ్చు. ఇరుదేశాల మధ్య అతిపెద్ద సమస్య కశ్మీర్‌. ఈ అంశంపై రెండు దేశాలు చర్చలు ప్రారంభించాలి’ అని అన్నారు.

చైనా, అరేబియా దేశాలతో దోస్తీ
అమెరికాతో సత్సంబంధాలతో పాక్‌కు మేలు జరుగుతుంది. అమెరికాకు పాక్‌తో బంధాలు కాపాడుకోవడం అవసరం. ఇది పరస్పర ప్రయోజనాల అంశం. ఇరాన్, సౌదీ అరేబియాలతోనూ మా దోస్తీ కొనసాగుతుంది. చైనాతో మా బంధాలను బలోపేతం చేసుకుంటాం. చైనా–పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌లో పెట్టుబడులు పెట్టి వారు మాకో అవకాశాన్ని కల్పించారు. అవినీతిపై యుద్ధం, ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడంలో చైనా నుంచి మేం చాలా నేర్చుకుంటాం. ఉగ్రవాదంపై పోరు కారణంగా అఫ్గనిస్తాన్‌ నష్టపోయింది. ఆ దేశంలో శాంతి నెలకొనటమంటే పాక్‌లో శాంతి నెలకొన్నట్లే’ అని అన్నారు.

అప్పుడలా.. ఇప్పుడిలా!
న్యూఢిల్లీ: ఆర్మీ అండదండలతో ప్రస్తుత పాక్‌ ఎన్నికల్లో దూసుకుపోతున్న ఇమ్రాన్‌ ఒకప్పుడు ప్రభుత్వ వ్యవహారాల్లో ఆర్మీ జోక్యాన్ని నిరసించేవారు. కొద్దికాలానికే సైన్యంపై తన అభిప్రాయాన్ని ఆయన మార్చుకోవడంతో తాజాగా పాక్‌ ప్రధాని పీఠం అధిరోహించేందుకు మార్గం సుగమమైంది. 2012లో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో మీడియాతో ఖాన్‌ మాట్లాడుతూ.. ‘పాక్‌లో ఆర్మీ రోజులు పోయాయి. త్వరలోనే అక్కడ నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడటాన్ని మీరు చూస్తారు’ అని వ్యాఖ్యానించారు. ఈ ఇంటర్వ్యూ అనంతరం 2013లో జరిగిన ఎన్నికల్లో పీటీఐ 35 సీట్లతో చతికిలపడింది.

కానీ 2018లో జరిగిన ఎన్నికల్లో పీటీఐ పాక్‌లోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేవలం ఎన్నికల ఫలితాలే కాదు.. ఈ ఐదేళ్లలో ఆర్మీ పట్ల ఇమ్రాన్‌ అభిప్రాయం, వ్యవహారశైలి మారాయి. ఇటీవల ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ఇంటర్వ్యూలో. ‘అది పాక్‌ ఆర్మీయే తప్ప శత్రు దేశపు సైన్యం కాదు. నేను ఆర్మీని కలుపుకునిపోతాను’ అని అన్నారు. భారత్‌పైనా ఇమ్రాన్‌ అభిప్రాయాలు మారాయి. గతంలో భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు చెప్పిన ఆయన.. తాజా ఎన్నికల ప్రచారంలో భారత్‌ షరీఫ్‌తో కలసి పాక్‌ సైన్యాన్ని బలహీనపర్చేందుకు కుట్రచేస్తోందన్నారు. కశ్మీర్‌లో భారత సైన్యం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు.  

మదీనాలా పాక్‌
పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కృషిచేస్తూ పాక్‌ను మదీనా తరహాలో అభివృద్ధి చేస్తానని ఇమ్రాన్‌ అన్నారు. ‘మహ్మద్‌ ప్రవక్త స్ఫూర్తితో పాకిస్తాన్‌ను మదీనాగా మారుస్తా. మానవత్వం పరిమళించే దేశంగా మారుస్తా. నేను చేపట్టే సంక్షేమపథకాలు ధనికుల కోసం కాదు. పేద ప్రజలకోసమే. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు భిన్న వ్యూహాలతో ముందుకెళ్తాం. విలాసవంతమైన పాకిస్తాన్‌ ప్రధాని నివాసంలో నేనుండను. దాన్ని విద్యాకేంద్రంగా మారుస్తా’ అని అన్నారు. 

మరిన్ని వార్తలు