ప్రాణాలకు తెగించి పైలట్‌ సాహసం.. వైరల్‌

12 Jan, 2019 16:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మంచు పర్వాతాలు ఎక్కుతూ పర్వతారోహకులు, స్కీయింగ్‌ చేస్తూ సాహసికులు అప్పుడప్పుడు ప్రమాదాలకు గురవడం, వారిని ఎమర్జెన్సీ సర్వీసులకు చెందిన నిపుణులు హెలికాప్టర్లలో వెళ్లి రక్షించడం తెల్సిందే. మంచు పర్వతాల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి వెళ్లే హెలికాప్టర్లు కూడా కొంత దూరం నుంచి తాళ్లతోని, ఇతరత్రా బాధితులకు కాపాడుతాయి. బాధితుల వద్దకు పూర్తిగా వెళ్లే అవకాశం వాటికి ఉండదు. ఎందుకంటే హెలికాప్టర్లు కూడా ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది కనుక. కానీ ఫ్రెంచ్‌ ఎమర్జెన్సీ సర్వీసుకు చెందిన ఓ హెలికాప్టర్‌ పైలట్‌ మాత్రం ప్రాణాలకు తెగించి సాహసించడమే కాకుండా అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేసి ప్రపంచ ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.

జనవరి రెండవ తేదీన ఫ్రాన్స్‌లోని  ఆల్ఫ్స్‌ మంచు పర్వతాల్లో బ్రూనో తాజియట్‌ స్కీయింగ్‌ చేస్తుంటే అతని మొకాలి చిప్ప ‘డిస్‌లోకేట్‌’ అవడంతో అతను కుప్పకూలిపోయారు. ఇది గమనించిన అతని మిత్రుడు నికోలస్‌ డెరీలీ ఎమర్జెన్సీ సర్వీసుకు ఫోన్‌ చేయడంతో ఓ హెలికాప్టర్‌ వచ్చి వెయ్యి మీటర్ల ఎత్తులో చిక్కుకున్న బ్రూనోను రక్షించింది. రోడ్డుమీద గాయపడిన వ్యక్తి వద్దకు అంబులెన్స్‌ తీసుకొచ్చి ఆపినట్లుగా ఏటవాలుగా ఉన్న కొండ అంచుదాక హెలికాప్టర్‌ను తీసుకెళ్లి దాని ముక్కును మంచులోకి గుచ్చి నిశ్చలంగా హెలికాప్టర్‌ నిలబడేలా పైలట్‌ దాన్ని కంట్రోల్‌ చేస్తుండగా, బాధితుడిని మరొక మిత్రుడు హెలికాప్టర్‌లోకి ఎక్కించడం మనకు కనిపిస్తుంది. ఈ సాహసోపేత చర్యను తన సెల్‌ఫోన్‌ వీడియాలో బంధించిన మిత్రుడు నికోలస్‌ ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేయగా అది వైరల్‌ అవుతోంది. ఇప్పటి వరకు దాదాపు ఏడున్నర లక్షల మంది దీన్ని వీక్షించారు.

మరిన్ని వార్తలు