అమెరికా బరిలో‘ సమోసా’ సత్తా

5 Nov, 2018 22:49 IST|Sakshi

చట్టసభల్లో పెరగనున్న భారత వాణి

‘మధ్యంతర ఎన్నికల్లో’ 100మందికిపైగా భారతీయ అమెరికన్లు

 అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఒకవైపు దేశంలోకి విదేశీయుల రాకను(వలసలు) నియంత్రించడానికి శతవిధాల ప్రయత్నిస్తోంటే మరోవైపు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచుకోవడానికి భారతీయ అమెరికన్లు పోటీ పడుతున్నారు. నవంబర్‌ ఆరో తేదీన జరిగే మధ్యంతర ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల నుంచి వంద మందికి పైగా భారతీయ అమెరికన్లు ప్రతినిధుల సభ, సెనెట్‌లతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగే శాసనసభ, స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికన్‌ కాంగ్రెస్‌లో ఐదుగురు భారతీయ అమెరికన్లు సభ్యులుగా ఉన్నారు. మధ్యంతర ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పోటీ చేయడం రాజకీయంగా బలపడాలన్న భారతీయ అమెరికన్ల ఆకాంక్షను ప్రతిఫలిస్తోందని భారతదేశంలో అమెరికా మాజీ రాయబారి రిచ్‌ వర్మ అన్నారు. ‘అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్ల హవా పెరుగుతుండటం నమ్మశక్యంకాని నిజం’అని ఆయన వ్యాఖ్యానించారు.దేశ జనాభాలో భారతీయ అమెరికన్లు ఒక శాతం వరకు (40లక్షలు)ఉన్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్‌ సభ్యులుగా ఉన్న ఐదుగురు భారతీయ అమెరికన్లు అమి బెరా, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, ప్రమీల జయపాల్,శివ అయ్యదురైలు మధ్యంతర ఎన్నికల్లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నలుగురిలో అమిబెరా కాలిఫోర్నియా నుంచి మూడుసార్లు కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు.ఖన్నా(కాలిఫోర్నియా), కృష్ణమూర్తి(ఇల్లినాయిస్‌),ప్రమీల(వాషింగ్టన్‌) మొదటి సారి ఎన్నికయ్యారు.అమిబెరా నాలుగోసారి, మిగతా ముగ్గురు రెండో సారి బరిలో దిగారు. అమెరికన్‌ కాంగ్రెస్‌లో ఉన్న ఐదుగురు భారతీయ అమెరికన్లనుఅనధికారికంగా ‘సమోసా కాకస్‌’గా పిలుస్తారు.కృష్ణమూర్తే తమ బృందానికి ఈ పేరు పెట్టారు.ప్రస్తుతం ఉన్న ఐదుగురు సభ్యులు మధ్యంతరంలో ఎన్నికవడం ఖాయమని చెబుతున్నారు.వీరు కాకుండా మరో ఏడుగురు భారతీయ అమెరికన్లు కూడా మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభకు పోటీ చేస్తున్నారు. శివ అయ్యదురై మసాచుసెట్స్‌ నుంచి సెనెట్‌కు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఎలిజిబెత్‌ వారెన్‌తో ఆయన తలపడుతున్నారు. శివ ఎలిజిబెత్‌కు గట్టిపోటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.మిగతా వారిలో తిపిర్నేని, కులకర్ణి, పురేవాల్‌లు ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇస్తున్నారని ఎన్‌బీసీ న్యూస్‌ పేర్కొంది.

ఈసారి ఎన్నికలు చాలా మంది కొత్త వారిని ప్రతినిధుల సభ, రాష్ట్ర శాసన సభలకు పంపుతున్నాయని వర్మ తెలిపారు. పలువురు భారతీయ అమెరికన్ల తరఫున ఆయన ప్రచారం చేస్తున్నారు.ఆరిజోనా నుంచి టెక్సాస్‌ వరకు ఒహియో, మిచిగాన్‌ తదితర రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.ఈ ఎన్నికల తర్వాత అమెరికన్‌ కాంగ్రెస్‌లో మన బలం పెరుగుతుందన్న నమ్మకం ఉందంటున్నారు కృష్ణమూర్తి. ఈ ఎన్నికల కోసం ఆయన 50 లక్షల డాలర్ల నిధి సంపాదించారు. ఈ సారి ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు ఎక్కువ మంది గెలిచే అవకాశం కనిపిస్తోంది.నా జీవితంలో ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలు’అని వర్మ అన్నారు. ట్రంప్‌ జాత్యహంకార, వలసవాద వ్యతిరేక ధోరణులను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.ట్రంప్‌ విధానాలతో అమెరికన్లు, ముఖ్యంగా భారతీయ అమెరికన్లు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని, తమ భయాన్ని, నిరసనను గట్టిగా చెప్పడం కోసమే ఈ సారి అనేక మంది భారతీయ అమెరికన్లు బరిలో దిగారని వర్మ స్పష్టం చేశారు. మధ్యంతరంలో పోటీ చేస్తున్న భారతీయ అమెరికన్లలో ఎక్కువ మంది డెమోక్రాట్‌ పార్టీ తరఫున నిలబడ్డారు.
     
 

మరిన్ని వార్తలు