రూ.250 కోట్ల వజ్రం కోసం.. రంగంలోకి ఇంటర్‌పోల్‌

16 Aug, 2017 08:46 IST|Sakshi
రూ.250 కోట్ల వజ్రం కోసం.. రంగంలోకి ఇంటర్‌పోల్‌

జోహన్నెస్‌బర్గ్‌: ఒక్క వజ్రం ఆచూకీ ప్రపంచదేశాల పోలీసులకు సవాల్‌గా మారింది. ఫ్రాన్స్‌, లెబనాన్‌, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, దుబాయ్‌, రష్యా ఇలా పలు దేశాల పోలీసులు చోరికి గురైన రూ.250 కోట్ల విలువైన పింక్‌ వజ్రాన్ని కనిపెట్టేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. నిందితులు పెద్ద స్ధాయికి చెందిన వ్యాపారస్ధులు కావడం, వారు ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటుండటం కేసు దర్యాప్తును మరింత క్లిష్టతరం చేస్తోంది.

తాజాగా ఈ కేసులో నలుగురు భారతీయ ఆఫ్రికన్లు జునైద్‌ మోతీ, అబ్బాస్‌ అబూబకర్‌ మోతీ, అష్రఫ్‌ కాకా, సలీం బొబట్‌లకు ఇంటర్‌పోల్‌ రెడ్‌ నోటీసులు జారీ చేసింది(ఇంటర్‌పోల్‌ రెడ్‌ నోటీసులు జారీ చేస్తే ఆ వ్యక్తిని ప్రపంచంలో ఎక్కడున్నా అరెస్టు చేసి తరలిస్తారు). దీంతో వారు నోటీసులను నిలిపివేయాలంటూ ప్రిటోరియా హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే వీరు ఫ్రాన్స్‌, లెబనాన్‌, జింబాబ్వే, దుబాయ్‌ కోర్టుల్లో వజ్రానికి సంబంధించి విచారణను ఎదుర్కొంటున్నారు.

ఏం జరిగింది..
కొన్నేళ్ల క్రితం రష్యాకు చెందిన టెలికమ్యూనికేషన్‌ టైకూన్‌, వజ్రాల వ్యాపారితో పింక్‌ డైమండ్‌ను రూ.250 కోట్లకు అమ్మడానికి నలుగురు భారతీయ ఆఫ్రికన్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ముగిసే సమయంలో ఇరువురూ ఒకరిపై మరొకరు ఆరోపణలకు దిగారు. వజ్రం తమ దగ్గరలేదంటే తన దగ్గరలేదంటూ ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు. అది చాలక కోర్టుల్లో ఒకరిపై మరొకరు దొంగతనం కేసులు వేసుకున్నారు.

కొత్త కథ తెరపైకి..
తమతో పాటు బిజినెస్‌ నడిపిన మాజీ భాగస్వామి అలిబెక్‌ ఇస్సేవ్‌ అనే వ్యక్తిపై నలుగురు భారత ఆఫ్రికన్లు ఆరోపణలు చేశారు. ప్రిటోరియా కోర్టులో ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. ఇస్సేవే అసలు దోషి అని, అతనే వజ్రాన్ని అపహరించాడని చెప్పారు. తమపై ఇంటర్‌పోల్‌ జారీ చేసిన రెడ్‌ నోటీసుపై స్టే ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.

మరో వ్యాపారి తెరపైకి..
అంతర్జాతీయ వజ్రాల వ్యాపారి సైల్లా మౌస్సా తాజాగా చేసిన వ్యాఖ్యలు కొత్త దుమారాన్ని రేపుతున్నాయి. 2003లో పింక్‌ డైమండ్‌ను తన నుంచి నలుగురు భారత ఆఫ్రికన్లు అపహరించుకుపోయారని ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఆ పింక్‌ డైమండ్‌ తనదేనని ఆయన అంటున్నారు. అయితే, దీనిపై మాట్లాడిన నలుగురు భారతీయ ఆఫ్రికన్లలో ఒకరైన కాకా.. తమకు పడిన బాకీని చెల్లించేందుకు పింక్‌ డైమండ్‌ను మౌస్సానే ఇచ్చారని చెప్పారు. కాగా, ఇంటర్‌పోల్‌ జారీ చేసిన నోటీసులు ఇంతవరకూ తమకు చేరలేదని దక్షిణాఫ్రికా పోలీసులు తెలిపారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు