ఓ పవిత్ర పర్వతం కోసం ఆ రెండు దేశాలు

11 Aug, 2019 16:10 IST|Sakshi

జెరూసలేం : టెంపుల్‌ మౌంట్‌ అనే పవిత్ర పర్వతం మాదంటే మాదంటూ ఇజ్రాయెల్‌, పాలస్తీనా దేశాలు కొట్టుకుంటున్నాయి. దీంతో ఇరుదేశాల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఇస్లాం పవిత్ర దినాలలో ఒకటైన ఈద్‌ అల్‌ అదాను జరుపుకోవడానికి దాదాపు 80,000 మంది పాలస్తీనా ముస్లింలు పాత జెరూసలేంలోని టెంపుల్‌మౌంట్‌కు చేరుకొని ప్రార్థనలు నిర్వహించారు. ఇజ్రాయెల్‌కు చెందిన యూదులకు కూడా ఇదే రోజు టిషాబీఆవ్‌ అనే పండుగ ఉండటంతో వారు సైతం కొండ ప్రాంతానికి చేరుకున్నారు. వారిని కొండపైకి ఇజ్రాయెల్‌ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉగ్రవాదానికి సహకరిస్తున్నారా అంటూ గట్టిగా నినాదాలు చేశారు.

అయితే, టెంపుల్ మౌంట్ ప్రాంత ప్రవేశద్వారం వద్ద హమాస్ పార్టీకి చెందిన నాయకులతోపాటు ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు, ముస్లిం బ్రదర్‌హుడ్‌ నాయకుడు మొహమ్మద్ మోర్సీ ఫోటోలతో కూడిన పెద్ద బ్యానర్ ఉండటం యూదులను ఇంకా ఆగ్రహానికి గురిచేసింది. కొందరు రాడికల్‌ యూదులు కొండపై ఉండే అల్-అక్సా మసీదును ముట్టడించాలని పిలుపునిచ్చారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ పెరిగి హింస చెలరేగడంతో ఇజ్రాయెల్ పోలీసులు జోక్యం చేసుకున్నారు. పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతోపాటు బాష్పవాయువును ప్రయోగించడంతో  చాలామంది గాయపడ్డారు. కాగా, మక్కా వార్షిక తీర్థయాత్రల ముగింపును సూచించే ఈద్ అల్ అదా పండుగను జరుపుకొనే పవిత్ర ప్రాంతంగా టెంపుల్‌మౌంట్‌ను ముస్లింలు భావించగా, చరిత్రలో యూదులు ఎదుర్కొన్న విపత్తులను స్మరించుకుంటూ, దాడుల్లో నాశనం అయిన కొండప్రాంతంపై గల రెండు పురాతన జెరూసలేం దేవాలయాలను తలుచుకొని.. రెండు రోజుల సంతాపం దినంగా  టిషాబీ ఆవ్‌ అనే పండుగను ఇజ్రాయెల్‌ ప్రజలు జరుపుకుంటారు.

సరిహద్దు ఘర్షణలో పాలస్తీనీయులు మృతి
గాజా-ఇజ్రాయెల్‌ మధ్య సరిహద్దు ప్రాంతంలో శనివారం ఉదయం నలుగురు పాలస్తీనీయులను ఇజ్రాయెల్‌ సైన్యం కాల్చి చంపింది. ఈ మేరకు సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. రైఫిల్స్‌, క్షిపణి నిరోధక ట్యాంకర్లు, హ్యాండ్‌ గ్రెనెడ్‌ వంటి భారీ ఆయుధాలు ఆ నలుగురి వద్ద ఉన్నాయని, వాటిలో ఒక దానిని ఇజ్రాయెల్‌ సైన్యంపై విసిరారని ఆ ప్రకటన పేర్కొంది. వారిలో ఒకరు సరిహద్దును దాటి రావడంతో కాల్పులు ప్రారంభించినట్లు సైన్యం వెల్లడించింది. 

మరిన్ని వార్తలు