పీవోకే భారత్‌దే.. పాక్‌ తీవ్ర స్పందన

18 Sep, 2019 11:42 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని, ఏదో ఒకరోజున దానిని దేశ భౌగోళిక అధికార పరిధిలోకి తీసుకొచ్చేస్తామని భారత్‌ చేసిన వ్యాఖ్యలపై దాయాది పాకిస్థాన్‌ తీవ్రంగా స్పందించింది. భారత్‌ దుందుడుకుగా చేస్తున్న వ్యాఖ్యలను అంతర్జాతీయ సమాజం సీరియస్‌గా పరిగణించాలని కోరింది. బాధ్యతారాహిత్యంగా, అసంబద్ధంగా భారత్‌ ప్రకటనలు చేస్తోందని, దీనితో దాయాదుల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయి.. ఉపఖండంలో శాంతిభద్రతలు ప్రమాదంలో పడే అవకాశముందని పాక్‌ చెప్పుకొచ్చింది.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని, ఏదో ఒకరోజున దానిని దేశ భౌగోళిక అధికార పరిధిలోకి తీసుకొచ్చేస్తామని విదేశాంగమంత్రి ఎస్‌ జయశంకర్‌ మంగళవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. కశ్మీర్‌ అంశంపై ప్రజలు ఏమంటారోనని ఎక్కువగా దిగులు చెందాల్సిన అవసరంలేదని, కశ్మీర్‌ అనేది భారత్‌ అంతర్గత సమస్య అని, త్వరలోనే సద్దుమణుగుతుందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు