జైషే చీఫ్‌ మసూద్‌ మృతి?

3 Mar, 2019 17:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జైషే మహ్మద్‌ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజర్‌ మరణించినట్టు వార్తలు వెలువడ్డాయి. పీఓకేలోని జైషే స్ధావరాలపై భారత్‌ ఇటీవల చేపట్టిన వైమానిక దాడుల్లో తీవ్రంగా గాయపడిన మసూద్‌ అజర్‌ మరణించాడని పాకిస్తాన్‌లో స్థానిక మీడియా వెల్లడించింది. శనివారం మసూద్‌ మరణించినట్లు ప్రచారం సాగుతోంది. కాగా, మసూద్‌ మృతిని పాకిస్తాన్‌ అధికారికంగా ధృవీకరించలేదు. గత కొన్ని నెలలుగా కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్న మసూద్‌ పాక్‌ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. మసూద్‌ అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారని పాక్‌ విదేశాంగ మంత్రి మహ్మద్‌ ఖురేషి సైతం పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా మసూద్‌ పాకిస్తాన్‌లోనే ఉన్నాడని ఆయన నిర్ధారించినట్లయ్యింది. తమ భూభాగంలోనే మసూద్‌ ఉన్నాడని పాకిస్తాన్‌ అంగీకరించడం అదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, మసూద్‌ అజర్‌ మృతి వార్తలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇది పాకిస్తాన్‌ ప్రణాళికలో భాగమా.. లేక నిజంగానే మసూద్‌ మరణించాడా అనేది తేలాల్సి ఉంది. మసూద్‌ అజర్‌ను తమకు అప్పగించాలంటూ భారత్‌  ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో అతను మృతి చెందాడనే వార్త అనేక అనుమానాలకు తావిస్తోంది. 

(ఇక్కడ చదవండి: ‘జైషే క్యాంపులపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిజమే’)

మరిన్ని వార్తలు