భాగస్వామ్యం బలోపేతం

29 Oct, 2018 02:10 IST|Sakshi
ఆదివారం జపాన్‌ ప్రధాని షింజో అబేతో భారత ప్రధాని నరేంద్ర మోదీ

జపాన్‌–భారత్‌లది వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యం

జపాన్‌ ప్రధాని అబేతో మోదీ భేటీ

అత్యంత విలువైన మిత్రుడు అని అబే కితాబు

యమనషి: భారత్‌–జపాన్‌ల భాగస్వామ్యం పూర్తిగా పరివర్తనం చెందిందనీ, ఇప్పుడు అది ‘ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యం’గా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘ఇరు దేశాల బంధంలో ప్రతికూలతలేవీ లేవు. ఉన్నవన్నీ అవకాశాలే’ అని జపాన్‌ మీడియాతో మోదీ అన్నారు. జపాన్‌–భారత్‌ 13వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు మోదీ జపాన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ దేశంలోని అత్యంత ఎత్తైన పర్వతం ఫుజి దగ్గర్లోని ఓ రిసార్ట్‌లో జపాన్‌ ప్రధాని షింజో అబేతో మోదీ అనధికారిక చర్చలు జరిపారు. ఆదివారం మొత్తంగా మోదీ–అబేలు 8 గంటలపాటు కలిసి గడిపారు. జపాన్‌–భారత్‌ సంబంధాల పురోగతిని సమీక్షించి, వ్యూహాత్మకంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వార్షిక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ‘సుందరమైన యమనషి ప్రాంతంలో అబెను కలుసుకోవడం అమితానందంగా ఉంది’ అని మోదీ అన్నారు.

ప్రత్యేక ఆతిథ్యానికి కృతజ్ఞతలు: మోదీ
రోబో పరిశ్రమను సందర్శించిన అనంతరం కవగుచి సరస్సు సమీపంలోని తన సొంత ఇంటికి మోదీని అబే తీసుకెళ్లి విందు ఇచ్చారు. విదేశీ నేతను ఈ ఇంటికి అబే ఆహ్వానించడం ఇదే తొలిసారి. దీనిపై మోదీ ట్వీటర్‌లో స్పందిస్తూ ‘తన ఇంట్లో ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చిన అబేకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాప్‌స్టిక్‌లను ఉపయోగించి జపాన్‌ విధానంలో ఆహారాన్ని ఎలా తినాలో కూడా అబే నాకు నేర్పించారు’ అని తెలిపారు. విందు తర్వాత ఇరువురు ప్రధానులు రైలులో టోక్యోకు చేరుకున్నారు. అక్కడే సోమవారం అధికారిక భేటీలో మోదీ, అబేలు పాల్గొంటారు. ద్వైపాక్షిక భద్రత, ఆర్థిక సహకారాలను బలపరిచే అంశంపై వీరిద్దరూ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం తరహాలోనే జపాన్‌ కూడా ఓ పథకాన్ని అమలు చేస్తోంది. దీనిపై కూడా వారిద్దరూ చర్చించే అవకాశం ఉంది. తాను ప్రధాని అయ్యాక అబేను కలవడం ఇది 12వ సారని మోదీ చెప్పారు.

భారత్‌కు జీవితకాల మిత్రుణ్ని: అబే
భారత్‌కు తాను జీవితకాల మిత్రుడినని అబే తెలిపారు. తాను అత్యంత ఆధారపడదగ్గ, తనకున్న అత్యంత విలువైన స్నేహితుల్లో మోదీ ఒకరన్నారు. జపాన్‌ తొలి ప్రధాని, తన తాత నొబుసుకె కిషి 1957లో భారత్‌ను సందర్శించడాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ‘జపాన్‌ ఇంత ధనిక దేశం కానప్పుడు నాటి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కిషిని తీసుకెళ్లి జపాన్‌ ప్రధానిగా వేలాదిమందికి పరిచయం చేశారు. 1958 నుంచే భారత్‌కు జపాన్‌ రుణాలు ఇవ్వడం ప్రారంభమైంది’ అని అబే పేర్కొన్నారు. 2007లో తాను భారత్‌ను సందర్శించినప్పుడు ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశపు పార్లమెంటులో ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వడం ద్వారా తనకు భారత్‌ కల్పించిన గౌరవాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.  

అబేకి మోదీ బహుమతి
హోటల్‌లో మోదీకి అబే అల్పాహారం విందు ఇచ్చారు. అనంతరం వారిద్దరూ అక్కడి ఉద్యానవనంలో తిరుగుతూ మాట్లాడుకున్నారు. చేతితో మలిచిన రెండు రాతిగిన్నెలను, రాజస్తాన్‌ పలుగురాళ్లు పొదిగిన దుప్పట్లను, జోధ్‌పూర్‌లో తయారైన చెక్కపెట్టెను మోదీ అబేకు బహుమతిగా ఇచ్చారు. వీటన్నింటినీ మోదీ జపాన్‌ పర్యటన కోసమే ప్రత్యేకంగా తయారు చేయించారు. తర్వాత ఇద్దరూ పారిశ్రామిక రోబోలను తయారుచేసే ఎఫ్‌ఏఎన్‌యూసీ పరిశ్రమను సందర్శించారు. ‘ఇరు దేశాల భాగస్వామ్యాన్ని ఆధునిక సాంకేతికత స్థాయికి తీసుకెళ్తున్నాం. మోదీ, అబే రోబోల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఎఫ్‌ఏఎన్‌యూసీ పరిశ్రమను సందర్శించారు’ అని విదేశాంగ శాఖ తెలిపింది. రోబోలు ఎలా పనిచేస్తాయి, వాటి సామర్థ్యాలేంటనే విషయాలను పరిశ్రమ సిబ్బంది వారికి వివరించారు.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు