కిమ్‌ ‘మిస్టిరియస్‌ ప్రియురాలిని’ చూసి.. షాక్‌!

23 Jan, 2018 09:38 IST|Sakshi

ఉత్తర కొరియాలో ఆమె ఒక ‘మిస్టిరియస్‌ మహిళ’... ఆమె గురించి అనేక పుకార్లు ఉన్నాయి. దేశానికి నియంత పాలకుడిగా ఉన్న కిమ్‌ జాంగ్‌ ఉన్‌కు ఆమె ప్రియురాలు అని, విభేదాల కారణంగా ఆమెను గతంలోనే కిమ్‌ ఉరితీయించాడని వదంతులు కూడా వచ్చాయి. ఉత్తర కొరియాలో అందమైన భామగా, దేశానికి చెందిన ప్రముఖ యువతుల బ్యాండ్‌ సారథిగా ఆమె పాశ్చాత్య మీడియాలో పాపులర్‌ అయ్యారు.

ఇలా అనేక వదంతులకు కేంద్ర బిందువుగా ఉన్న హ్యోన్‌ సాంగ్‌ వోల్‌ ఆదివారం ఒక్కసారిగా శత్రుదేశమైన దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో దర్శనమిచ్చారు. ద.కొరియాలో జరుగుతున్న వింటర్‌ ఒలింపిక్స్‌లో ఉ. కొరియా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇక్కడ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఆమె సియోల్‌ వచ్చింది. ఆమెను చూడగానే ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టి టకటకా ఫొటోలు తీసుకున్నారు. కానీ ఆమె మీడియాతో మాట్లాడలేదు.

ఉ.కొరియా చేపడుతున్న అణ్వాయుధ పరీక్షల కారణంగా కొరియా దేశాల నడుమ తీవ్ర శత్రుత్వం, ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ద.కొరియాతో సంబంధాలు మెరుగుపరుచుకునే ఉద్దేశంతో ఉ.కొరియా వింటర్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఒప్పుకుంది. మిస్టిరియస్‌ మహిళ హ్యోన్‌ సాంగ్‌ వోల్‌ సియోల్‌లో అడుగుపెట్టగానే నిరసనలు హోరెత్తాయి. ఆమె సియోల్‌కు రాగానే కొందరు నిరసనకారులు కిమ్‌జాంగ్‌ ఉన్‌ ఫొటోలను తగులబెట్టి నిరసన తెలిపారు. సోమవారం సియోల్‌ రైల్వేస్టేషన్ వద్ద ఆమెకు ప్రత్యక్షంగా నిరసన సెగ తగిలింది. ఆమె ఎదురుగానే 150 నుంచి 200 మంది నిరసనకారులు కిమ్‌ ఫొటోను, ఉత్తర కొరియా జెండాను తగలబెట్టేందుకు ప్రయత్నించారు. ఆమె మౌనంగా చూస్తూ ఉండిపోయారు. కానీ స్పందించలేదు. పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారుల్ని చెదరగొట్టారు. అయినా, ఆ తర్వాత నిరసనకారులు వాటిని తగలబెట్టి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు.

మరిన్ని వార్తలు